హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమ్మెకు బిజెపి పూర్తి మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండీలో అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. అక్కడ చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు పిల్లలకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆర్టిసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

‘‘ఆర్టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఈ అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం విషయంలో ప్రభుత్వానికి ఆర్టిసి కార్మికులు అన్ని విధాల సహకరిస్తున్నప్పటికీ.. వారి సమస్యలు పరిష్కరించకపోవడం దారుణం. ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆర్టిసి కార్మికులకు పిఆర్‌సితో పాటు వారి డిమాండ్లను పరిష్కరించాలి’’ అని కిషన్ రెడ్డి అన్నారు.