టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో 2026  టీవీఎస్ రైడర్ 125 రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్లలో అప్‌డేట్ చేయబడిన ఫీచర్లు, రంగులు ఉన్నాయి. అయితే బైక్ స్పోర్టీ లుక్‌లో ఎలాంటి మార్పు లేనప్పటికీ ఈ బైక్ అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.82,680 (ఎక్స్-షోరూమ్) ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. కొత్తగా విడుదలైన SXC DD వేరియంట్ ధర రూ.96,725. కాగా, TFT DD వేరియంట్ ధర  మాత్రం రూ.98,500గా ఉంది.


కొత్త రంగులు, వేరియంట్లు

ఈ అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణ కొత్త నైట్రో గ్రీన్ కలర్. కంపెనీ ఈ రంగును హెడ్‌ల్యాంప్ కవర్, ఫ్రంట్ ఫెండర్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్‌తో సహా బైక్ ముందు భాగానికి అప్లై చేసింది. దీనికి అనుబంధంగా లైట్ యాష్ కలర్ గ్రాఫిక్స్‌ను ఉపయోగించారు. అదనంగా, బైక్‌కు స్పోర్టీ లుక్ ఇవ్వడానికి ముందు అల్లాయ్ వీల్ ఆకుపచ్చ రంగులో, వెనుకది నలుపు రంగులో ఉంటుంది.


టీవీఎస్ రైడర్ 125 ఫీచర్లు

టీవీఎస్ రైడర్ 125లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు, గ్లైడ్-త్రూ ట్రాఫిక్ టెక్నాలజీ, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. 2026 మోడల్‌లో అతిపెద్ద అప్‌డేట్ ఏమిటంటే? దాని టాప్ వేరియంట్‌లో పాత ఎల్సీడీ యూనిట్ స్థానంలో కొత్త ఫుల్-కలర్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చడం. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్‌లు, రైట్ అనలిటిక్స్,  వెదర్ అప్‌డేట్‌లు, లైవ్ స్పోర్ట్స్ స్కోర్‌లతో సహా అనేక కనెక్టెడ్ ఫీచర్లను అందిస్తుంది. ఎస్‌ఎక్స్‌సి డీడీ వేరియంట్‌లో కూడా ఎల్సీడీ కన్సోల్ ఉంటుంది. కానీ ఇది 85కి పైగా కనెక్టెడ్ ఫీచర్లను అందిస్తుంది.


ఇంజిన్, హార్డ్‌వేర్

మెకానికల్‌గా 2026 టీవీఎస్ రైడర్ 125లో ఎలాంటి మార్పులు లేవు. ఇది 11.38hp, 11.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే అదే 124.8cc, ఎయిర్-  ఆయిల్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. ఈ బైక్‌లో iGO అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇది అవసరమైతే టార్క్‌ను తాత్కాలికంగా 11.75Nm వరకు పెంచగలదు.


సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్

ఈ బైక్‌లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు 5-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందువైపు 240mm డిస్క్ బ్రేక్, వెనుకవైపు 200mm డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఈ రెండింటికీ సింగిల్-ఛానల్ ABS అమర్చబడింది.