హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బిఆర్ఎస్, బిజెపి పార్టీలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. 1000 రోజుల కాంగ్రెస్ విఫల పాలనకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సీలు గన్‌పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.  నలుపు రంగు దుస్తులు ధరించి అసెంబ్లీలోకి వెళ్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు హరీష్ రావు, జగదీష్ రెడ్డి కింద పడిపోయారు. నలుపు రంగు దుస్తులు ధరించి అసెంబ్లీలోకి రాకూడదని పోలీసులు తమను అడ్డుకున్నారని బిఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.  అసెంబ్లీ గేటు ముందు మాజీ మంత్రి హరీష్ రావు, అనిల్ జాదవ్ టీషర్ట్ విప్పి బనియన్‌తో నిరసన వ్యక్తం చేశారు. బనియన్‌తోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు హరీశ్ రావు ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

నల్ల టీషర్ట్ ధరించి అసెంబ్లీలోకి రావడంపై పోలీసులకు అభ్యంతరం ఎందుకు అని వారు ప్రశ్నించారు.  తనని పోలీసులు చేతులు పట్టుకొని లాగడంతో కిందపడిపోయానని బిఆర్ఎస్ ఎంఎల్ఎ సునీతా లక్ష్మారెడ్డి ఆరోపణలు చేశారు. పోలీసులు కింద పడేసి తొక్కారని, వారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తానని, చర్యలు తీసుకోవాలని సునీత డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా దుర్మార్గంగా పోలీసులు ప్రవర్తిస్తారా అంటూ సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముందు కిందపడిపోవడంతో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకున్నారు.  అసెంబ్లీకి రండి అని కాంగ్రెసోళ్లు అంటారని, మళ్లీ అసెంబ్లీకి వస్తే ఏమో కాంగ్రెస్ వాళ్లు భయపడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డిని అరెస్టు చేసే క్రమంలో పోలీసులు జుట్టు పట్టుకొని లాగారని ఆమె ఆరోపణలు చేసింది.