ఒడిశా నుంచి గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్న 13 కిలోల గంజాయిని బాచుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు బాచుపల్లి ఎక్స్‌రోడ్స్ సమీపంలో ఎస్ఓటి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న గంజాయి, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు అనంతరం బాచుపల్లి పోలీసులకి అప్పజెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్ట్ అయిన నిందితుడు కృష్ణ జెనా (29) ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం గుజరాత్‌లోని సూరత్‌లో నివాసం ఉంటున్నాడు. అతడి వద్ద ఉన్న ఏడు ప్యాకెట్లలో మొత్తం 13 కిలోల గంజాయిని గుర్తించిన ఎస్ఓటి పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

అలాగే ఒక వివో మొబైల్ ఫోన్‌ను కూడా సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో కృష్ణ జెనా ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి సూరత్‌లో అక్రమంగా విక్రయించేందుకు తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఒడిశాలోని బలుగావ్‌కు చెందిన జీలా అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడిని పరారీలో ఉన్న నిందితుడిగా నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని బాచుపల్లి పోలీసులు హెచ్చరించారు. కేసుకు సంబంధించి మరిన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.