భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ పక్ష నేతగా ఎంపికయ్యారు. కోల్‌కతాలో అమిత్‌షా సమక్షంలో భాజపా శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం బెంగాల్ కొత్త ముఖ్యమంతిగా సువేందు అధికారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. శనివారం ఆయన పశ్చిమ బెంగాల్ తొమ్మిదో ముఖ్యమంత్రిగా, అలాగే రాష్ట్రంలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.

రెండుసార్లు మమతా బెనర్జీని ఓడించి..

ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపిక చాలామందికి ఆశ్చర్యం కలిగించలేదు. గత కొన్నేళ్లుగా ఆయన బెంగాల్‌లో అత్యంత ప్రభావశీల భాజపా నాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా రెండు ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టడం ఆయన రాజకీయ ప్రస్థానంలో పెద్ద మైలురాయిగా నిలిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ స్వయంగా పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారి ఆమెను ఓడించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. అనంతరం తాజాగా జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీకి అత్యంత బలమైన కోటగా భావించిన భవానీపూర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ విజయం సాధించడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విజయాలు మాత్రమే కాకుండా, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించడంలో సువేందు అధికారి కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ వేగంగా ఎదగడానికి ప్రధాన వ్యూహకర్తల్లో ఆయన ఒకరుగా గుర్తింపు పొందారు.

ప్రతిపక్ష నేతగా..

సువేందు అధికారి రాజకీయ ప్రయాణం ఎప్పుడూ పోరాటపూరితంగానే సాగింది. ముఖ్యంగా గత ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతగా పనిచేసిన సమయంలో ఆయన మమతా బెనర్జీ ప్రభుత్వానికి ప్రధాన సవాల్‌గా నిలిచారు. అసెంబ్లీ లోపల, బయట ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పోరాటం చేస్తూ బీజేపీని రాష్ట్రంలో ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సువేందు అధికారి ఎదుగుదల కేవలం ఎన్నికల విజయాలతో మాత్రమే పరిమితం కాలేదు. ప్రతిపక్ష నేతగా ఆయన సాగించిన తీవ్ర రాజకీయ పోరాటాలు, అసెంబ్లీ లోపల, బయట చేపట్టిన ఆందోళనలు ఆయనను బీజేపీ ప్రధాన ముఖచిత్రంగా నిలబెట్టాయి. శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సువేందు అధికారి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు, చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటానికి ముందుండేవారు. అసెంబ్లీలో తరచుగా ఘాటు ప్రసంగాలు చేస్తూ, తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసేవారు. ఆయన దూకుడైన వ్యాఖ్యలు, ఆగ్రహభరిత చర్చలు తరచూ సభా కార్యక్రమాలను ఉత్కంఠభరితంగా మార్చేవి.

అయితే ఆ రాజకీయ పోరాటాలకు ప్రతిఫలంగా తీవ్ర ప్రతిస్పందనలు కూడా ఎదురయ్యాయి. అప్పటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిగిన ఘర్షణల నేపథ్యంలో సువేందు అధికారి సహా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు అనేకసార్లు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెరుగుతున్న వైరం ఈ సస్పెన్షన్ల ద్వారా స్పష్టమైంది. కొన్ని సందర్భాల్లో మొత్తం అసెంబ్లీ సమావేశ కాలం పాటు సస్పెన్షన్ కొనసాగగా, మరికొన్ని సందర్భాల్లో కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. అలాంటి ఘటనల్లో 2025 ఫిబ్రవరిలో చోటుచేసుకున్న ఒక సంఘటన రాజకీయంగా విసృ్తత చర్చకు దారితీసింది. ఆ సమయంలో సువేందు అధికారిని వరుసగా 30 రోజుల పాటు అసెంబ్లీకి దూరంగా ఉంచారు. రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన రాజకీయ ఘర్షణల కాలంగా ఆ దశను రాజకీయ విశ్లేషకులు అభివర్ణించారు.

అసెంబ్లీ వెలుపల కూడా సువేందు అధికారి బీజేపీ ఆందోళనలకు ప్రధాన నాయకత్వం వహించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన హింసాత్మక ఘటనలపై ఆయన భారీ నిరసనలు చేపట్టారు. అలాగే రాష్ట్ర సచివాలయం నబన్నా ముట్టడికి పిలుపునిస్తూ పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు. అవినీతి, నిరుద్యోగం, శాంతిభద్రతల సమస్యలపై కూడా సువేందు అధికారి నిరంతరం ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలను సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ బీజేపీ రాజకీయ దాడులకు కేంద్రబిందువుగా నిలిచారు.

ఉద్యమ నాయకుడిగా..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సువేందు అధికారి దూకుడు నాయకుడిగా ఎదగడంలో పలు కీలక ఉద్యమాలు ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నియామక కుంభకోణంపై జరిగిన ఆందోళనల్లో ఆయన అత్యంత దూకుడుగా వ్యవహరించారు. నియామకాల్లో వ్యవస్థాగత అవినీతి జరిగిందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంలో ఉన్నతస్థాయి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరంతరం డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో సువేందు అధికారి బీజేపీకి ప్రధాన ఉద్యమ నాయకుడిగా అవతరించారు. 2023 పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల హింస, బెదిరింపులు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ఆయన విసృ్తత నిరసనలు నిర్వహించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రభావితం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

అలాగే 2024లో సందేశ్‌ఖాలి ఘటనల నేపథ్యంలో జరిగిన ఆందోళనల్లో కూడా సువేందు అధికారి బీజేపీ ప్రధాన స్వరంగా నిలిచారు. స్థానిక ప్రభావశీల నేతలను అధికార పార్టీ కాపాడుతోందని, ప్రజల గొంతును అణచివేస్తోందని ఆరోపిస్తూ ఆయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై దాడి చేశారు. సందేశ్‌ఖాలి ఘటనను రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాజకీయ అంశంగా మలచడంలో కీలక పాత్ర పోషించారు.ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు సంబంధించిన వివాదం అనంతరం చెలరేగిన ఆగ్రహావేశాన్ని కూడా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మార్చేందుకు సువేందు అధికారి ప్రయత్నించారు. ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని రాష్ట్ర ప్రభుత్వంపై విసృ్తత రాజకీయ పోరాటంగా మలచాలని బీజేపీ వ్యూహంలో ఆయన ముందుండారు. ర్యాలీలు, ధర్నాలు, అసెంబ్లీలో ఘర్షణాత్మక చర్చలు, రాష్ట్రవ్యాప్తంగా ప్రచార యాత్రల ద్వారా సువేందు అధికారి నిరంతరం పోరాటపటిమ కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకున్నారు.

2020 డిసెంబరులో తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన తర్వాత బెంగాల్‌లో జరిగిన దాదాపు ప్రతి ప్రధాన బీజేపీ ఉద్యమానికి ఆయననే ముఖచిత్రంగా పార్టీ నిలబెట్టింది.పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సువేందు అధికారి ఎదుగుదల వెనుక రాజకీయ వ్యూహంతో పాటు ఆయన వ్యక్తిగత నేపథ్యం కూడా కీలకంగా మారింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలోనే బెంగాల్‌లో పార్టీ ముఖ్యమంత్రి ఈ నేలలో పుట్టి పెరిగిన వ్యక్తి అవుతారని ప్రకటించారు. ఆ నిర్వచనానికి సువేందు అధికారి పూర్తిగా సరిపోతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.