
పారదర్శకంగా ఆన్‌లైన్ విధానంలో
సీట్ల భర్తీకి ప్రభుత్వానికి గతంలోనే
ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలు
వివిధ కారణాలతో
ఆన్‌లైన్ విధానంసై నాన్చుడు ధోరణి
బి కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియపై స్పష్టత కరువు
అయోమయానికి గురవుతున్న విద్యార్థులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో బి కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రతిపాదించిన ఆన్‌లైన్ విధానం అమలుపై అడుగు ముందుకు పడటం లేదు. డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, ఇతర సిఎస్‌ఇ అనుబంధ బ్రాంచీల సీట్లను లక్షలాది రూపాయల డొనేషన్లకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యామండలి ఆన్లైన్ విధానాన్ని తీసుకురావాలని భావించినప్పటికీ, అది ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. ప్రస్తుతం కన్వీనర్ కోటా కింద 70 శాతం ఇంజనీరింగ్ సీట్లు ద్వారా కౌన్సెలింగ్ ద్వారా సజావుగా సాగుతున్నప్పటికీ, మిగిలిన 30 శాతం యాజమాన్య కోటా సీట్ల భర్తీ బాధ్యతను కళాశాల యాజమాన్యాలకే వదిలేస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద సుమారు 94 వేల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, 25 వేలకు పైగా సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద అందుబాటులో ఉన్నాయి.
ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిఫియల్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ బ్రాంచీల్లో ఒక్కో సీటును రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు అమ్ముకుంటున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వద్ద సమాచారం ఉన్నట్లు తెలిసింది. ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు గరిష్ఠంగా ఏడాదికి 5 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసుకునే వెసులుబాటు ఉండగా అంతకు రెట్టింపు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సగటున ఒక్కో సీటు రూ.5 లక్షలకు అమ్ముకున్నా యాజమాన్యాలు కోట్లలో దండుకుంటున్నాయని అంచనా. మరోవైపు సీట్ల అమ్మకం వ్యవహారంపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఏటా ఉన్నత విద్యా మండలి అధికారులకు ఫిర్యాదులు చేయడంతోపాటు ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నాయి.
ఇంజనీరింగ్ బీ కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగే సమయంలో ఉన్నత విద్యామండలి కార్యాలయంలో వద్ద రెగ్యులర్‌గా పోలీసు బందోబస్తు నిర్వహించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. తమకు తక్కువ మొత్తానికి సీట్లు ఇప్పించాలంటూ విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు తమపై ఒత్తిడి తెస్తున్నారని, ఆఫీసుల్లో తిష్ట వేస్తున్నారని ఉన్నతాధికారులే వాపోతున్నారు. దీనిని అరికట్టేందుకు పారదర్శకంగా ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లు భర్తీకి ఆన్‌లైన్ అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదించినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అక్రమాలకు అడ్డుకట్ట పడేదేలా..?
నిబంధనల ప్రకారం బి కేటగిరీ సీట్లను జెఇఇ మెయిన్ ర్యాంకులు లేదా ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలి. కానీ, ఏటా ప్రకటనలు ఇవ్వడం, దరఖాస్తులు స్వీకరించడం అంతా ఆయా కళాశాలల పరిధిలోనే సాగుతుండటంతో మెరిట్ అభ్యర్థులకు సీట్లు దక్కడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టాప్ కాలేజీల్లో సిఎస్‌ఇ సీటు కోసం రూ. 10 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నారు. అర్హులైన విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీల్లో దరఖాస్తు చేసుకుందామంటే ఆయా కళాశాలల వెబ్‌సైట్లు పనిచేయక పోవడం, ప్రత్యక్షంగా వెళ్తే సీట్లు లేవని చెప్పడం వంటి అడ్డంకులు ఎదురవుతున్నాయి. అన్ని కళాశాలల బి కేటగిరీ సీట్లను ఆన్‌లైన్ విధానంలో ఒకే కేంద్రీకృత ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా భర్తీ చేస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉండి తమకు నచ్చిన కాలేజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా కూడా ఆన్‌లైన్‌లో బహిరంగంగా కనిపిస్తుంది కాబట్టి అక్రమాలకు తావుండదు. కానీ, పలు కాలేజీల యాజమాన్యాల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, సాంకేతిక, చట్టపరమైన కారణాలను సాకుగా చూపి అధికారులు ఈ ప్రక్రియను నాన్చుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
భారమవుతున్న ఆలస్యం
కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ పూర్తయ్యే సమయానికి బి కేటగిరీ ప్రక్రియపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం తుది విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సీట్లు భర్తీ పూర్తయినప్పటికీ ఇంకా బి కేటగిరీ సీట్ల భర్తీ పూర్తి కాలేదు. మరో వారం రోజుల్లో ఈ సీట్ల భర్తీకి పూర్తి చేసేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోంది. మెరిట్ ఉండి కూడా ప్రైవేటు వర్సిటీలకు లేదా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ స్పందించి, పారదర్శకమైన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే బి కేటగిరీ ప్రవేశాలను నిర్వహించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.








