మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ మిన హా మిగతా అన్ని కమిటీలు రద్దు చేస్తూ పార్టీ అధినేత కె.చం ద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే అన్ని స్థా యిల కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్‌కు అప్పగించారు. వెంటనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో సోమవారం అధినేత కెసిఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్ ర జతోత్సవాల ముగింపు సమావేశం జరిగింది.

ఈ సందర్భం గా కెటిఆర్ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. లో క్‌సభలో బిఆర్‌ఎస్ సభ్యులు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ఇటీవల లోక్‌సభలో బిజెపి ఎంపి తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బిజెపి ఎంపీలు ఒక్కమాట మాట్లాడలేదని, బిఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లని పేర్కొన్నారు. హెచ్చరించారు. కాళేశ్వరంపై రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడితే బిఆర్‌ఎస్ పక్షనేత సురేశ్ రెడ్డి గట్టిగా ఖండించారని గుర్తు చేశారు.


తెలంగాణ పట్ల బిఆర్‌ఎస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తనను ఎన్నోసార్లు, ఎంతో మంది మానసిక క్షోభకు గురిచేశారని అన్నారు. హైదరాబాద్ విషయంలో రాజీపడాలని సోనియాగాంధీ ఎన్నోసార్లు చెప్పారని గుర్తుచేశారు. సోనియాగాంధీ ఎన్నోసార్లు చెప్పినా తాను రాజీపడలేదని, అది తన చిత్తశుద్ధి అని స్పష్టం చేశారు. ప్రజలకు ఇన్ని కార్యక్రమాలు చేసినా ఎందుకు ఓడిపోయామో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. 60 లక్షల సభ్యత్వాలు ఉన్నా ఎందుకు ఓడిపోయామో ఆత్మ విమర్శ చేసుకోవాలని తెలిపారు. సింగరేణి కార్మికులకు అన్నీ చేసినా ఆ ప్రాంతంలో ఓడిపోయామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు విసుగు చెందారని, వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయాలంటే కిషన్‌రెడ్డి పారిపోయారని గుర్తుచేశారు. చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టిడిపితో తాము పొత్తు పెట్టుకున్నామని వివరించారు.

రైతుల పరిస్థితి దిగజారిపోయింది

తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావట్లేదని ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఇది చండాలమైన ప్రభుత్వం.. ఇది చిల్లర ప్రభుత్వం అని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాటలు, కూతలు ఏమిటి..? అంటూ సిఎం రేవంత్‌రెడ్డిపై కెసిఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణను కాంగ్రెస్ నాయకులు పెంటకుప్పగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బొందలో పడినట్లయిందని ఆవేదనతో ఉన్నారని తెలిపారు. పక్క రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పెద్ద అంబేద్కర్ విగ్రహాన్నీ చూడడానికి వస్తుంటే ఈ ప్రభుత్వం గేట్లు తీయడం లేదని మండిపడ్డారు.