
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహ్మాన్ ప్రతిపాదిత భారత్ పర్యటనకు సంబంధించి ఢాకా రెండు కీలక షరతులు విధించింది. భారత్ తమ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు పరారీలో ఉన్న నిందితులను అప్పగించే విషయంలో ముందడుగు వేయకపోతే రహ్మాన్ న్యూఢిల్లీ పర్యటన జరిగే అవకాశం లేదని ఆదివారం బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
రహ్మాన్ ద్వైపాక్షిక పర్యటనకు సంబంధించిన అవకాశాలపై ఇరు దేశాల అధికారులు గత కొన్ని వారాలుగా సంప్రదింపులు జరుపుతున్నారని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆగస్టు 5న న్యూఢిల్లీలో షేక్ హసీనా బహిరంగంగా మీడియాతో మాట్లాడటం ఈ చర్చలపై ప్రభావం చూపిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఏకేఎం షాహిదుల్ కరీమ్ తెలిపారు. “ఈ పర్యటనకు అనుకూలమైన వాతావరణాన్ని ముందుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మేం భావిస్తున్నాం” అని కరీమ్ పేర్కొన్నారు. “ఇందులో భాగంగా షేక్ హసీనా, పరారీలో ఉన్న నేరస్థులను అప్పగించాలన్న మా అభ్యర్థనపై భారత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరాం. అలాగే ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా అమరవీరుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని విజ్ఞప్తి చేశాం. వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నాం” అని ఆయన తెలిపారు.
రాజకీయ కార్యకర్త ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులైన ఇద్దరిని పశ్చిమ బెంగాల్ పోలీసులు మార్చిలో అరెస్టు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సరిహద్దు పట్టణం బొంగావ్‌లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) వారిని అదుపులోకి తీసుకుంది. పొరుగు దేశాలతో సహా ఇతర దేశాలతో సార్వభౌమ సమానత్వం, జాతీయ గౌరవం, పరస్పర అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, పరస్పర ప్రయోజనం వంటి ప్రాతిపదికలపై స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు ‘బంగ్లాదేశ్ ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తామని విదేశాంగ శాఖ మరోసారి స్పష్టం చేసింది. షేక్ హసీనాను బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాల్లో దోషిగా నిర్ధారించినప్పటికీ.. ఆమె న్యూఢిల్లీలో బహిరంగంగా మీడియాతో మాట్లాడటం వల్ల రహ్మాన్ పర్యటనకు సంబంధించిన ప్రక్రియ ప్రతికూలంగా మారిందని బంగ్లాదేశ్ పేర్కొంది. అయితే హసీనా, బంగ్లాదేశ్ అధికారులతో కలిసి నిర్వహించిన ఆ మీడియా సమావేశానికి భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థన ప్రస్తుతం పరిశీలనలో ఉందని భారత్ గతంలోనే తెలిపింది. 2024 ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలో ప్రారంభమైన ఆందోళనలు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారడంతో షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయారు. అనంతరం ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చి ఇక్కడే ఉంటున్నారు.








