బతుకమ్మ కుంటను చెరపట్టింది ఎవరు..? ఏ నాయకుడు వస్తే హెలికాప్టర్లో పూలు చల్లి బతుకమ్మ కుంటను చెరపట్టారో అందరికీ తెలుసని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని సోమవారం సిఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ.. బతుకమ్మ కుంటను పునరుద్ధరించామని, ఎండాకాలంలో కూడా నీళ్లు ఊరాయని, బతుకమ్మ కుంటకు వచ్చి విమలక్క పాటలు పాడితే, ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే ఆయన బతుకమ్మ కుంటను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయనకు ఎవరు మద్దతు ఇస్తున్నారో ఆలోచించాలన్నారు.

బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మీకే అప్పగించామని, హైడ్రాను తెచ్చానని తనపై ఆరోపణలు చేసి నిందిస్తున్నారని సిఎం అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జాలు చేస్తున్నది ఎవరో ప్రజలు ఆలోచించాలన్నారు. పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 1,000 రోజులు పూర్తి చేసుకున్నామని, 1,000 రోజుల ప్రజా పాలనపై తాము కార్యాచరణ తీసుకున్నామని చెప్పారు. నిరసన తెలుపుతామని కొందరు బయలుదేరారని, పదేళ్లు తెలంగాణను నడిపించిన వాళ్లు, కబళించిన వాళ్లు ఇప్పుడు నిరసనలు తెలుపుతామంటున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.