తాష్కెంట్‌లో మోదీకి ఆత్మీయ స్వాగతం

తాష్కెంట్: భారత్ ఉజ్బెకిస్థాన్ తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని ఆదివారం నిర్ణయించాయి. అలాగే 2030 నాటికి ఏటా 5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.

పౌర అణు ఇంధన రంగంలో సహకారానికి అనుగుణంగా.. ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్‌కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేసేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. మోదీమిర్జియోయెవ్ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాలు, గనుల తవ్వకం, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఔషధాలు, ఆరోగ్యం, సమాచార సాంకేతికత, యూపీఐ సహా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1 బిలియన్ డాలర్లకు పైగా ఉందని మోదీ తెలిపారు. 2030 నాటికి దీనిని ఏటా 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తన ప్రకటనలో వెల్లడించారు.

భారత్ ఉజ్బెకిస్థాన్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరిస్తున్నట్లు ఇరు దేశాల నేతలు ప్రకటించారు. భారత్‌తో ఉజ్బెకిస్థాన్ సంబంధాలు మరింత లోతుగా, విసృ్తతంగా మారుతున్న తీరుకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. గనుల తవ్వకం, సంసృ్కతి, విద్య, పర్యాటకం, ఆయుర్వేదం తదితర విసృ్తత రంగాలకు సంబంధించిన పలు ఒప్పందాల మార్పిడిని ఇరు దేశాల నేతలు వీక్షించారు. ‘మధ్య ఆసియాకు ఉజ్బెకిస్థాన్ నడిబొడ్డున ఉంటే.. ఈ ప్రాంతంలో భారత్ భాగస్వామ్యానికీ అది కేంద్రంగా ఉంది’ అని మోదీ అన్నారు. ‘భారత్‌ఉజ్బెకిస్థాన్ భాగస్వామ్యం మరింత బలోపేతమైతే.. మధ్య ఆసియాలో శాంతి, అభివృద్ధి, సుసంపన్నతకు అది శక్తివంతమైన బలంగా నిలుస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్ సహకారానికి సంబంధించి ప్రతిష్ఠాత్మక ప్రణాళికలను వివరిస్తూ.. సైనిక సామగ్రి అభివృద్ధి, ఉత్పత్తిలో ఇరు దేశాల రక్షణ పరిశ్రమలు సంయుక్తంగా పనిచేసేలా ప్రోత్సహిస్తామని మోదీ తెలిపారు. ‘మన రెండు దేశాల మధ్య సన్నిహిత రక్షణ, భద్రతా సహకారం పరస్పరంగా మనకు ఉన్న గాఢమైన విశ్వాసానికి ప్రతిబింబం. భవిష్యత్తులో రక్షణ పరిశ్రమల మధ్య ప్రత్యక్ష అనుసంధానాలు, సంయుక్త ఉత్పత్తి, సంయుక్త అభివృద్ధిని ప్రోత్సహిస్తాం’ అని మోదీ అన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం మొత్తం ప్రాంతానికీ తీవ్రమైన సవాళ్లుగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ ముప్పులపై ఏమాత్రం సహనం చూపని విధానాన్ని కొనసాగించడం ఇరు దేశాల ఉమ్మడి సంకల్పమని ఆయన స్పష్టం చేశారు.

ఉజ్బెకిస్థాన్‌లోని ఫయాజ్ టెపా, కారా టెపా బౌద్ధ స్థలాల పునరుద్ధరణ, పరిరక్షణకు సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. దక్షిణ ఉజ్బెకిస్థాన్‌లోని ఈ పురాతన బౌద్ధ విహారాలు సిల్క్ రోడ్ వెంట బౌద్ధం ఎలా విస్తరించి, మధ్య ఆసియాలో అభివృద్ధి చెందిందో తెలియజేస్తున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, స్వచ్ఛ ఇంధనం సహా పలు రంగాల్లో ఉజ్బెకిస్థాన్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో మోదీ శనివారం రెండు రోజుల పర్యటనకు తాష్కెంట్ చేరుకున్నారు. ‘మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి 15వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇలాంటి ప్రత్యేక సందర్భంలో మన సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆదివారం ద్వైపాక్షిక చర్చల ప్రారంభంలో మోదీ అన్నారు. ఈ భాగస్వామ్యానికి అనుగుణంగా స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతామని ఆయన హిందీలో పేర్కొన్నారు. గత రాత్రి విందు సందర్భంగా ఉజ్బెక్ అధ్యక్షుడితో జరిగిన ‘ఫలవంతమైన చర్చలను’ కూడా మోదీ ప్రస్తావించారు.

ఇరు దేశాల సహకారంలోని అన్ని అంశాలకు దిశానిర్దేశం చేసేందుకు విదేశాంగ మంత్రుల స్థాయిలో కోఆర్డినేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని మోదీ చెప్పారు. అలాగే ప్రస్తుతం కార్యదర్శుల స్థాయిలో ఉన్న సంయుక్త కమిషన్‌ను మంత్రుల స్థాయికి పెంచనున్నట్లు తెలిపారు. ఇరు దేశాలకు చెందిన వ్యాపార ప్రముఖులతో కలిసి సంయుక్తంగా బిజినెస్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్‌కు యురేనియం దీర్ఘకాలిక సరఫరాకు కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన వెల్లడించలేదు. భారత్‌తో వివిధ రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని తమ దేశం దృఢంగా నిర్ణయించుకుందని ఉజ్బెక్ అధ్యక్షుడు మిర్జియోయెవ్ తెలిపారు.

మోదీకి ‘ఒలియ్ దరజాలి దోస్త్లిక్’ గౌరవం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం విదేశీ నేతలకు అందించే అత్యున్నత పురస్కారం ‘ఒలియ్ దరజాలి దోస్త్లిక్’ ఆర్డర్‌ను ఆదివారం ప్రదానం చేసింది. భారత్ ఉజ్బెకిస్థాన్ మధ్య కొనసాగుతున్న స్నేహబంధానికి ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నట్లు మోదీ తెలిపారు. వాణిజ్యం, స్వచ్ఛ ఇంధనం, అనుసంధానత తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్థాన్‌లో ఉన్నారు. ఉజ్బెక్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ప్రధానికి ఈ పురస్కారాన్ని అందజేశారు. ‘ఒలియ్ దరజాలి దోస్త్లిక్’ పురస్కారం అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఈ గౌరవాన్ని భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య కొనసాగుతున్న సుస్థిర స్నేహబంధానికి అంకితం చేస్తున్నాను’ అని మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడంలో మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో వెల్లడించింది. 140 కోట్ల మంది భారతీయులకు ఈ గౌరవాన్ని మోదీ అంకితం చేశారని, రెండు నాగరికతల మధ్య శాశ్వత స్నేహానికి ఇది ప్రతీక అని ఆయన పేర్కొన్నట్లు తెలిపింది.