హైదరాబాద్: భర్తను పొడిచి చంపిన కేసులో భార్యకు ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దంపతుల మధ్య గొడవ జరగడంతో భర్తను భార్య కత్తితో పొడిచి చంపింది. దీంతో ట్రయల్ కోర్టు భార్యకు నాలుగేళ్ల శిక్షతో పాటు జరిమానా విధించింది. దీంతో భార్య హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ తిరుమలదేవి ఈడ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. భార్యకు విధించిన నాలుగేళ్ల శిక్షను రద్దు చేయడంతో రూ.500 జరిమానాతో ఈ కేసును ముగించింది. కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి...  భర్త పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకొచ్చాడు. దంపతుల మధ్య గొడవ జరగడంతో అతడు భయటకు వెళ్లిపోయాడు. అర్థనగ్నంతో ఇంట్లోకి వచ్చి భార్యతో పాటు ఆమెతల్లిదండ్రులను అసభ్య పదజాలంతో దూషించాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని భార్య మెడలో పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. భర్త అత్యంత క్రూరంగా ఉండడంతోనే భర్తను చంపాలనే ఉద్దేశం మాత్రం లేదని పేర్కొంది. ఇరుగుపొరుగు సాక్ష్యాలు, పోస్టుమార్టం నివేదికలు, నిందితురాలు చూపించిన కత్తిని పోలీసులు కోర్టు ముందు ఉంచారు. భర్త అసభ్యకర ప్రవర్తనతోనే ఆకస్మిక ఆవేశంతో ఆమె నిర్ణయం తీసుకుందని కోర్టు పరిగణించింది. ఐపిసి సెక్షన్ 300లోని ఎక్సెప్షన్ 4 కిందకు వస్తుందని కోర్టు వివరించింది. 304 పార్ట్-2 కింద ఆమె నేరాన్ని అంగీకరిస్తూనే పరిస్థితులను బట్టి జైలు శిక్షను రద్దు చేసిందని అనంతరం ఆమెకు రూ.500 జరిమానాను కోర్టు విధించింది. స్పష్టమైన సాక్ష్యాలు ఉండడంతో పాటు నేరం వెనుక ఉన్న పరిస్థితులు శిక్షను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు.