
చిన్న నీటిపారుదల రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలు, చెరువుల పరిరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగంపై ప్రభుత్వానికి రైతు కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, చిన్న నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నీటి భద్రత, వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణ జీవనోపాధులను మెరుగుపరచవచ్చని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ పేర్కొంది. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక యూనిట్లతో ప్రత్యేక చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని కమిషన్ సూచించింది.
చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను అనుసంధానం చేస్తూ కమాండ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొంది. చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చిన్న నీటిపారుదల చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కమిషన్ తెలిపింది. చెరువుల పుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) సరిహద్దులను తక్షణమే గుర్తించి, ఆక్రమణలను తొలగించి చెరువులను పరిరక్షించాలని ప్రభుత్వానికి సూచించింది.
రాష్ట్రంలో నీటి భద్రతతో పాటు వ్యవసాయాన్ని స్థిరీకరించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధులను మెరుగుపరిచేందుకు చెరువుల పునరుద్ధరణ అత్యంత కీలకమని కమిషన్ అభిప్రాయపడింది. కాగా, గత రెండు సంవత్సరాలుగా కమిషన్ పనితీరుపై సిఎం సంతృప్తి వ్యక్తం చేసినట్లు కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, గంగాధర్, ఎం. భవానీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.











