
దివ్యాంగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను నెలకు రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 33 నెలలుగా పింఛన్‌లో ఒక్క రూపాయి కూడా పెంచకపోవడంతో హామీ మేరకు లెక్కిస్తే ఒక్కో దివ్యాంగుడికి రూ.1.98 లక్షలు బకాయి పడినట్లవుతుందన్నారు. ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో హస్తినాపురంలో నిర్వహించిన ‘సమర శంఖారావం’ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో దివ్యాంగుల పింఛన్‌ను రూ.516 నుంచి రూ.4,016కు పెంచామని, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు.
ప్రభుత్వం వద్ద నిధులు లేవా? లేక దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధి లేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ, ఫ్యూచర్‌సిటీ, ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. 33 నెలల్లో రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించారని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది. దివ్యాంగుల సమస్యలను సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ బలంగా ప్రస్తావిస్తుందని హరీశ్‌రావు తెలిపారు. హక్కుల సాధన కోసం ఇందిరాపార్కు వద్ద భారీ మహాధర్నా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.








