
దేశ రాజధాని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ ఢిల్లీలో తీవ్ర కలకలం రేగింది. హైకోర్టుతో పాటు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మెట్రో, అంబాలకు వెళ్లే రైళ్లు, జామ్ నగర్ హౌస్, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం సహా పలు కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవి భద్రతా దళాలను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు పోలీసు యూనిఫామ్‌లో ఎర్రకోట ప్రాంగణంలోకి ప్రవేశించి ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక హింసాకాండకు బాధ్యులైన రాజకీయ నేతలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఈ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డిమాండ్ చేశారు.
బెదిరింపు ఈ-మెయిల్ రాగానే ఢిల్లీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ వర్గాలు తక్షణమే రంగంలోకి దిగాయి. హైకోర్టు సహా ఆగస్టు 15 వేడుకలు జరిగే ఎర్రకోట పరిసర ప్రాంతాలలో భద్రతను పెంచారు. తనిఖీలు నిర్వహించారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీస్ డ్రస్‌లో వస్తారన్న హెచ్చరికల నేపథ్యంలో భద్రతా విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను పునఃపరిశీలించడం, తనిఖీలు చేపడుతున్నారు. బాంబ్ స్కాడ్‌లతో తనిఖీల తర్వాత అవి బెదిరింపు కాల్స్ మాత్రమేనని పోలీసులు తేల్చారు. ఖలిస్తాన్ వేర్పాటువాదుల బెదిరింపులుగా గుర్తించారు.










