మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పా ర్టీ అధినేత కెసిఆర్ సూచన మేరకే ఢిల్లీ వెళ్లి లాయర్లను కలిసినట్లు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు తెలిపారు. కానీ, తన ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎంఒ నుంచి లీకులు ఇచ్చారని, మీడియా వాళ్లతో అర్థం లేని బ్రేకింగ్‌లు పెట్టించారని ఆరోపించారు. విషయం ఉన్న వారు ఎవరైనా ఇలాంటి పనులు చేయరని, విషయం లేనివారే ఇలా చేస్తారని విమర్శించారు. సిఎం పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొనేందుకే అక్కడి లాయర్లతో మాట్లాడినట్లు చె ప్పారు. కాళేశ్వరం కేసులపై సీనియర్ లాయర్లతో చర్చించేందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. అలాగే మే 6వ తేదీన హైకోర్టులో రాబోతున్న ఎంఎల్‌ఎల ఫిరాయింపుల కేసుల విచార ణపై సీనియర్ లాయర్లతో చర్చించామని అ న్నారు. కాంగ్రెస్ బి.ఫామ్‌పై గెలిచి తాను ఇం కా బిఆర్‌ఎస్‌లోనే ఉన్నానని ఒక ఎంఎల్‌ఎ అనడం, దానిని స్పీకర్ ధృవీకరించడం అ త్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు.ఓటుకు నోటు కేసు కూడా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు సుప్రీంకోర్టులో విచారణకు రానుందని, ఆ కేసు గురించి కూడా న్యాయవాదులతో చర్చించామని తెలిపారు. పట్టపగ లు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.

ఇప్పుడు హోంమంత్రిగా ఆయనే ఉన్నాడు కాబట్టి కంప్లైంట్ కూ డా ఆయనే అని పేర్కొన్నారు. ఈ ఓటుకు నో టు కేసులో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున జగదీశ్ రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మ హమూద్ అలీ ఇంప్లీడ్ అయ్యారని చెప్పారు. ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్ల ను పెట్టి, సిఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నారని విమర్శించారు. ఆనాడు సమాఖ్య వాదులతో చేతులు కలిపి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది రేవంత్ రెడ్డి కాదా..? అని ప్రశ్నించారు. నాలుగున్నరేండ్ల నుంచి స్టేల మీద బతుకుతున్న రేవంత్ రెడ్డికి ఆ స్టే వెకేట్ అయిందంటే.. ముఖ్యమంత్రి సీటు ఊడటం,జైలుకు వెళ్లడం ఖాయం అని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. తమ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే తాను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లామని, అందులో దాచిపెట్టేదేమీ లేదని చెప్పారు. తన ఢిల్లీ పర్యటనపై కూడా చిల్లర ప్రచారం చేశారని మండిపడ్డారు.

కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..?

కెసిఆర్ సభ జరుగుతుందని ముందే తెలిసి, ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన కుచిత బుద్ధికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అని హరీష్‌రావు విమర్శించారు. కెసిఆర్ ప్రసంగం ఎప్పుడు ప్రారంభమవుతుందో చూసి అదే సమయానికి మైకు పట్టుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అని పేర్కొన్నారు. సోమవారం కెసిఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారని అన్నారు. కెసిఆర్ వ్యూవర్‌షిప్‌లో కనీసం 10 శాతం కూడా రేవంత్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ అధికారిక లైవ్‌లో బిఆర్‌ఎస్ సభను 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ లైవ్‌లో కేవలం 54 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కెసిఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో

ఈ లెక్కలే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎంతో హుందాగా, రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే..రేవంత్ రెడ్డి మాత్రం రాంకెలు వేయడం, ఏడవడం తప్ప ఇంకేం చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ జేజమ్మ దిగివచ్చినా దానిని ఆపలేరు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయని అన్నారు. ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి.. సోమవారం జగిత్యాల సభలో కెసిఆర్ గర్జిస్తారని భయపడి రాత్రికి రాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశారని చెప్పారు. కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..? అని ప్రశ్నించారు. పంట పెట్టుబడిగా ఇవ్వాల్సింది, పంట చేతికి వచ్చాక వేశారని తెలిపారు.

కాళేశ్వరం కూలిపోయిందని దుష్ప్రచారం చేశారు

రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాత్రి రాహుల్ గాంధీతో, ఉదయం బిజెపి వాళ్లతో తిరిగారని హరీష్ రావు వివర్శించారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఇన్నాళ్లు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ, రెండు పిల్లర్లు కుంగిపోయాయని, మరమ్మతులు చేస్తామని చెప్పారని సిఎం తాజాగా చెప్పారని పేర్కొన్నారు. మేడిగడ్డ రిపేరు చేసుకుని వాడుకుంటామని సిఎం ఒప్పుకున్నారని, రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్లా..? అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఎల్‌నినో రానుందని తెలియడంతో మేడిగడ్డ అవసరం తెలిసిందని అన్నారు.

మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని, కాళేశ్వరం వృథా అయితే మూసీలోకి గోదావరి నీళ్లు ఎలా ఎత్తిపోస్తావని ప్రశ్నించారు. కెసిఆర్ ఎంతో గొప్పగా ఆలోచించి కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని చెప్పారు. వరద ఉంటే మిడ్ మానేరు నుంచి, మధ్యస్థంగా నీరుంటే ఎల్లంపల్లి నుంచి, కరువు వస్తే మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునేలా కాళేశ్వరాన్ని డిజైన్ చేశారని తెలిపారు. రేవంత్ శంకుస్థాపన చేసిన గంధమల్ల కూడా కాళేశ్వరంలో భాగమే అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి నూకలు చెల్లాయి

రైతుబంధు, రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకు రేవంత్‌రెడ్డికి ప్రజలు ఓట్లు వేయాలా..? అని హరీష్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పగించినందుకా, తెలంగాణ డబ్బులను తీసుకెళ్లి ఢిల్లీకి, కుప్పానికి కడుతున్నందుకా..2 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసినందుకా..నెలకు రూ. 2500 ఇస్తామని మహిళలను దగా చేసినందుకా..స్కీములు లేవు కానీ రాష్ట్రాన్ని స్కాములతో నింపినందుకా..సింగరేణిని దోచుకున్నందుకు రేవంత్‌రెడ్డి ప్రజలు ఓట్లు వేయాలా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టినందుకా...

ఖమ్మం వెలుగుమట్లలో వేల ఇండ్లు కూల్చినందుకా...కలుషిత ఆహారంతో 200 మంది గురుకుల విద్యార్థులను పొట్టన పెట్టుకున్నందుకా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా లక్షలాది విద్యార్థులను అంధకారంలో నెట్టినందుకా.. ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను, అంగన్వాడీలను రోడ్డున పడేసినందుకా..ఫార్మా కంపెనీల కోసం లగచర్ల రైతుల చేతులకు బేడీలు వేసినందుకా..కులవృత్తులను ధ్వంసం చేసినందుకు ప్రజలు ఆయనకు ఓట్లు వేయాలా..? అని నిలదీశారు. ఎన్ని డ్రామాలు ఆడినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి నూకలు చెల్లాయి అని, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని అన్నారు.