హైదరాబాద్:  ఆర్ టిసి సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించాలని ఆర్టీసీ సోదరులు, తన కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సమ్మె సమస్యకు పరిష్కారం కాదు అని, ప్రభుత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని,  నాలుగు వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. పొన్న ప్రభాకర్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు అని, ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి వ్యతిరేకత లేదు అని స్పష్టం చేశారు, వెంటనే పరిష్కారం అయ్యే అంశాలు పూర్తి చేస్తామని, ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. 

ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చర్చించాల్సి ఉందని, వారు అధ్యయనం చేయడానికి నాలుగు వారాల గడువు అడిగామన్నారు.  ఈ రెండు అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క దగ్గర చర్చిస్తామని, నలుగురు అధికారుల కమిటీకి తెలియజేశామన్నారు. ఆర్టీసీ విలీనం ఆలస్యం అయిన ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయని తెలియజేశారు. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం నాయకత్వ అంశాలు ఉన్నాయని,  ప్రభుత్వం ఏర్పడగానే గతంలో పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశామని, పెండింగ్ డీఏ లు లేకుండా క్లియర్ చేశామన్నారు. 2013 పెండింగ్ బాండ్స్ క్లియర్ చేశామని, రూ.1205 కోట్లు ఉన్న పిఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించామని, రూ.690 కోట్లు ఉన్న సిసిఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామని, ఇవే కాకుండా నెల వారిగా పిఎఫ్, సిసిఎస్ కి 75 కోట్లు చెల్లిస్తున్నామని పొన్నం స్పష్టం చేశారు. 

ఉద్యోగులపై పని భారం పడకుండా ఉండడానికి 4538 ఉద్యోగాల నియామకాలు భర్తీ త్వరలోనే పూర్తవుతుందని, సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 1134 కారుణ్య నియామకాలు చేపట్టామని, గత ప్రభుత్వం లో వివిధ కారణాలతో శాశ్వతంగా సర్వీసు నుండి రిమూవ్ అయిన వారిలో ఇప్పటి వరకు దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని అంశాలు పరిష్కారం చేస్తామని, ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు వద్దు అని, గత ప్రభుత్వం లో 10 సంవత్సరాలుగా ఆర్టీసీ లో ఏం జరిగిందో కార్మికులందరికీ తెలుసునని, ఆర్టీసీ లో ప్రయాణించింది పేదలు గ్రామీణ ప్రాంత ప్రజలు మన అక్కా చెల్లెల్లు అని తెలిపారు. ప్రతి రోజు 65 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 45 లక్షల మంది మహిళలే ఉన్నారని తెలియజేశారు. ఆర్టీసీ లో నిత్యం ఉపాధి కోసం విద్య ,వైద్యం కోసం పోయే పరిస్థితి ఉందని, ప్రభుత్వం పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నమని, సమ్మె వద్దు అని ఆర్ టిసి కార్మికులను పొన్నం కోరారు.  మిమ్మల్ని ఎవరు అడ్డుకోరని, ప్రజాస్వామ్య పద్ధతి లో మీ నాయకులు నిరసన చేయవచ్చని, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకరావచ్చని, పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బందులు కలగజేయవద్దని, పేద ప్రజలకు కార్ల లో పోయే స్థోమత లేదన్నారు. 

ప్రతి ఒక్క ఆర్టిసి కుటుంబ సభ్యుడికి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరుపున కొట్లాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని, కార్మికుల సమస్యల పరిష్కారం పై సానుకూలంగా ఉన్నామని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. తాను విద్యార్థి నాయకుడిని కార్మికులకు అండగా ఉంటానని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లైఫ్ లైన్ అయిన ఆర్టీసీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఆర్ టిసి నాయకులు నిరసనలు చెసుకొనే హక్కు వారికి ఉందని, మిగతా వారంతా విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.