
కళ్లజోడు విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్ షోరూమ్‌లో హిజాబ్ బిందీ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఉద్యోగులు హిందూత్వాన్ని ప్రతిబింబించే బింది, బొట్టు పెట్టుకోవడం వంటివి చేయకూడదు అని చెబుతూ, హిజాబ్‌కు అనుమతి ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ మైనారిటీ మోర్చా నేతల ఆధ్వర్యంలో కొందరు హిందూ సంఘాల కార్యకర్తలు స్టోర్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యలకు బీజేపీ మైనారిటీ మోర్చా నేత నాజియా ఎలాహీ నాయకత్వం వహించారు. కార్యకర్తలు స్టోర్‌లోకి ప్రవేశించి సిబ్బందికి బొట్టు పెట్టడంతో పాటు చేతులకు పవిత్ర దారాలను కట్టారు. అలాగే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాజియా ఎలాహీ స్టోర్ ఫ్లోర్ మేనేజర్ మొహ్సిన్ ఖాన్‌ను ప్రశ్నిస్తూ, హిందూ మతంలోని కొన్ని సంప్రదాయాల ఆంక్షలపై వస్తున్న ఆరోపణలకు వివరణ కోరారు. మీరు మొహ్సిన్ ఖాన్ కాబట్టే బొట్టు పెట్టుకోవడాన్ని ఆపారా? అని ఆమె వీడియోలో ప్రశ్నించినట్లు వినిపించింది.
నాజియా ఎలాహీ మాట్లాడుతూ స్టోర్‌నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ మరొక మతాన్ని అణగదొక్కుతున్నారు. ఇది హిందూ దేశం. సంస్థ యజమాని క్షమాపణ చెప్పకపోతే లెన్స్కార్ట్ను బహిష్కరిస్తాం లేదా అన్ని ఔట్లెట్లనూ మూసివేయాల్సిందే అని హెచ్చరించారు. ఈ సందర్భంగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఫ్లోర్ మేనేజర్ మొహ్సిన్ ఖాన్ తో పాటు హిందూ ఉద్యోగులను ముందుకు పిలిచి వారి నుదుటిపై బొట్టు పెట్టారు. మతపరమైన గుర్తింపును వ్యక్తపరచడంలో ఎలాంటి సంకోచం ఉండకూడదు అని పేర్కొన్నారు. అయితే, ఈ సమయంలో ఉద్యోగులు అసౌకర్యంగా కనిపించినప్పటికీ ప్రతిఘటించలేదు. ఇదిలా ఉండగా, షోరూమ్‌లోని ఒక ఉద్యోగి, సంస్థ శిక్షణా సమయంలో బొట్టు పెట్టుకోవడం, చేతికి పవిత్ర దారం కట్టుకోవడం నిషేధమని చెప్పినట్లు ఆరోపించారు. అంతేకాకుండా, వివాహిత మహిళలు కూడా మంగళసూత్రం ధరించకూడదని సూచించారని ఆయన తెలిపారు. ఈ ఆరోపణలు అక్కడున్న వారిలో ఆగ్రహానికి దారితీశాయి. షోరూమ్ మేనేజర్ నుంచి వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హిందూ సంఘాల కార్యకర్తలు ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పేర్కొంటూ, పూర్తిస్థాయి విచారణ జరిగే వరకు ఔట్‌లెట్‌ను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు.
హిజాబ్‌కు అనుమతి ఇస్తూ, బిందీ, బొట్టు పెట్టుకోవడం వంటి హిందూ మత సంప్రదాయాలపై పరిమితులు విధించిందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో లెన్స్‌కార్ట్ వివాదాల్లో చిక్కుకుంది. వివాదం ముదురుతున్న నేపథ్యంలో సంస్థ క్షమాపణలు తెలియజేసింది. సంస్థ సీఈఓ పీయుష్ బన్సల్ వివరణ ఇస్తూ, ఆ విధాన పత్రం తప్పుదోవ పట్టించేలా ఉంది అని, అది సంస్థ ప్రస్తుత మార్గదర్శకాలను ప్రతిబింబించదని స్పష్టం చేశారు. వైరల్ అయిన ఆ పాత విధాన పత్రం పాత శిక్షణ గమనిక మాత్రమేనని, సంస్థ హెచ్ఆర్ విధానంలో భాగం కాదని తెలిపారు. బిందీ, బొట్టుకు సంబంధించిన సూచనలు తరువాత తొలగించేశామని కూడా పేర్కొన్నారు. తరువాత సంస్థ విడుదల చేసిన సమగ్ర ‘ఇన్-స్టోర్ స్టైల్ గైడ్’లో బిందీ, బొట్టు నుంచి హిజాబ్, తలపాగా (తుర్బాన్) వరకు అన్ని మత, సాంసృ్కతిక గుర్తులను తమ అన్ని ఔట్లెట్లలో అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.













