అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్‌పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ముగియనున్న రెండు వారాల కాల్పుల విరమణ గడువులోపు ఒప్పందం కుదరకపోతే, ఇరాన్‌పై బాంబు దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ తెలిపారు. నేను అలా చేయాలని అనుకోవడం లేదు అని సీఎన్‌బీసీ ‘స్క్వాక్ బాక్స్’ కార్యక్రమంలో ట్రంప్ అన్నారు. శాంతి చర్చలు కొనసాగేందుకు కాల్పుల విరమణను పొడిగిస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, వారు చర్చలకు రావాల్సిందే. ఒప్పందం కుదిరితే ఇరాన్ మళ్లీ బలమైన దేశంగా ఎదగగలదు అని పేర్కొన్నారు. అయితే ఒప్పందం లేకుండా కాల్పుల విరమణ ముగిస్తే, దాడులు మళ్లీ ప్రారంభించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అలాంటి దృక్పథంతో ముందుకు వెళ్లడం మంచిదని నేను భావిస్తున్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు.


ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్, మంచి ఒప్పందం కుదురుతుందని అనుకుంటున్నాను. వారికి వేరే మార్గం లేదు అని అన్నారు. మేము వారి నౌకాదళాన్ని, వైమానిక దళాన్ని దెబ్బతీశాం. వారి నాయకత్వాన్ని కూడా ప్రభావితం చేశాం అని పేర్కొన్నారు. అయితే, నాయకత్వ మార్పు పరోక్షంగా జరిగిందని ట్రంప్ సూచిస్తూ, ఇది నేరుగా చెప్పిన ‘రెజీమ్ ఛేంజ్’ కాకపోయినా పరోక్షంగా జరిగిందే అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత అమెరికాఇరాన్ చర్చలు ఫలితం లేకుండానే ముగియగా, రెండో విడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది.