హైదరాబాద్‌తో సహా 70 శాతం తెలంగాణకు త్రాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరమని హరీష్‌రావు తెలిపారు. రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయని, కానీ, రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి రాజకీయాలు చేయకూడదని ఆయన పేర్కొన్నారు. నిజానికి రూ.100, రూ.200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో రెండు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని, కానీ, రెండున్నరేళ్లుగా భూ సేకరణకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్‌రావు ఆరోపించారు. మోటార్లు, రిజర్వాయర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని, కేవలం కుట్రతోనే ఆపారని హరీష్‌రావు అన్నారు.

పర్ఫార్మెన్స్ మీద రాజకీయాలు జరగాలని, తమకంటే మంచి సంక్షేమ పథకాలు, ఆరు గ్యారంటీలు, 420 హామీల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఎన్‌డిఎస్‌ఏ అనేది కేవలం ఇంజనీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమేనని, దాంట్లో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఉండదని ఆయన అన్నారు. మళ్లీ అవే చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెబుతాయని ఆయన అన్నారు. ఆర్టీసి కార్మికుల న్యాయమైన సమ్మెకు బిఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది, తక్షణమే వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.