ఇండియన్ ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ఆదివారం ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ ఆర్సిబి, గుజరాత్ మధ్య జరగనుంది. దీంతో టీం ఇండియా బిజీ షెడ్యూల్‌పై ఫ్యాన్స్ దృష్టి పెట్టారు. ఐపిఎల్ తర్వాత భారత్ స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు ఏకైక టెస్ట్, మూడు వన్డేల్లో పోటీ పడతాయి. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వేలలో టీం ఇండియా పర్యటించనుంది. అయితే ఈ ఏడాది జపాన్ వేదికగా ఏషియన్ గేమ్స్ జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్ కోసం అందుబాటులో ఉండే 30 మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు. ఇందులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా.. సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మాన్ గిల్‌లను దూరం పెట్టారు.

వైభవ్‌తో పాటు సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్ వంటి యువ క్రికెటర్లను షార్ట్ లిస్ట్ చేశారు. ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. అదే సమయంలో స్వదేశంలో భారత్, వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇరు జట్లు మూడు వన్డేలు, ఐదు టి-20లు ఆడతాయి. ఈ సిరీస్‌తో పాటు 2028 ఒలింపిక్స్‌ గేమ్స్‌, టి-20 వరల్డ్‌కప్‌ సన్నద్ధత నేపథ్యంలో వర్క్‌లోడ్‌ దృష్ట్యా సూర్యకుమార్‌ను బీసీసీఐ ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేయలేదు. ఇక, శుభ్‌మాన్ గిల్ కూడా స్వదేశంలో వన్డేలకు సారథ్య బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. అందుకే అతడిని కూడా దూరం పెట్టారు.

ఇక ఈ లిస్ట్‌లో జస్ప్రీత్ బుమ్రా పేరు ఉన్నప్పటికీ.. అతడు తుది జట్టులో ఉంటాడా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. ఇక ఈ ఏషియన్ గేమ్స్‌లో టీం ఇండియా కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, తిలక్ వర్మ పేర్లు వినిపిస్తున్నాయి. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబేలు అందుబాటులో ఉంటారని బిసిసిఐ తెలిపింది. కానీ, వీరిలో ఇద్దరికి మాత్రమే తుది జట్టులో ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

ఏషియన్ గేమ్స్‌కి అందుబాటులో ఉండే 30 మంది వీరే...

యశస్వి జైస్వాల్‌, అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రింకు సింగ్‌, తిలక్‌ వర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ప్రసిద్ధ్‌ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి, అనుకుల్‌ రాయ్‌, ఆయుష్‌ బదోనీ, హర్ష్‌ దుబె, ధ్రువ్‌ జురెల్‌, ఖలీల్‌ అహ్మద్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రవి బిష్ణోయ్‌, షాబాజ్‌ అహ్మద్‌, శివమ్‌ దుబె, విప్రాజ్‌ నిగమ్‌, హర్షిత్‌ రాణా, యశ్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌.