
శంషాబాద్: హైదరాబాద్ నగర శివార్లలో నిర్వహిస్తున్న కోడి పందేలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి 22 మందిని అరెస్ట్ చేశారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడ ఆర్టివొ కార్యాలయం వెనుక ఓ పాత పౌల్ట్రీ ఫామ్‌లో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదిభట్ల పోలీసులతో కలిసి శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు.
ఈ దాడుల్లో నిందితుల నుంచి రూ.3.60 లక్షలు, 31 పందెం కోళ్లు, 146 కోడి కత్తులు, 20 సెల్‌ఫోన్లు, స్కోర్ నోట్‌బుక్ స్వాధీనం చేసుకున్నారు. 3 కార్లు, 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుంచి బెట్టింగ్‌దారులను పిలిపించి, కోడి పందేల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిర్వాహకుడు, భూమి యజమాని పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కోడి పందేలు, జూదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.













