
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయి ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ‘ది మాని టి.ఇన్’ చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్ బీఎస్ రావు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఉండబోయే ఈ సినిమా తెలుగు సినిమా మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తుందని చిత్ర దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ విభాగంలో అనుభవం ఉండడంతో టాలీవుడ్లో మొట్టమొదటిసారిగా ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్8కె ఫార్మాట్లో రూపొందించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు మాత్ర మే పరిమితమైన ఈ ఫార్మాట్‌ను ఇక్కడ పరిచయం చేయడం ద్వారా ప్రేక్షకులకు ఒక వినూత్నమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు.
ఈ చిత్ర కాన్సెప్ట్ గురించి దర్శకుడు బీఎస్ రావు మాట్లాడుతూ, మానవత్వం విఫలమైనప్పుడు ‘మానిటీ’ ఏం చేస్తుంది అనే ఒక విలక్షణమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుందని వివరించారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండు అదిరిపోయే పోస్టర్లను విడుదల చేశారు. సమాజంలో మనిషి విలువలు తగ్గినప్పుడు ప్రకృతి లేదా ఒక అదృశ్య శక్తి ఏ విధంగా స్పందిస్తుందనే అంశాన్ని సైన్స్ ఫిక్షన్, సోషల్ ఎలిమెంట్స్ కలగలిపి అద్భుతంగా రాసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, షూటింగ్ ప్రారంభానికి ముందే అన్ని రకాల టెక్నికల్ టెస్టులు పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు.














