హర్మూజ్ జలసంధి మీదుగా చమురు, గ్యాస్ నౌకలను పెద్ద ఎత్తున ఇరాన్ సైన్యం అడ్డుకొంటోందని అమెరికా తెలిపింది. ఈ మార్గంలో తాము ఇరాన్ దాడులను తిప్పికొట్టినట్లు , వేరే దేశాలకు చెందిన మూడు నౌకలను రక్షించినట్లు యుఎస్ నేవీ శుక్రవారం తెలిపింది. అమెరికా బలగాలపై దాడులకు ఎంచుకున్న ఇరాన్ సైనిక స్థావరాలను దెబ్బతీశామని కూడా వివరించారు. ఇరాన్ పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, వీటిని తాము ఎదుర్కొన్నామని అమెరికా సైనిక విభాగం తెలిపింది. అయితే కొన్ని పరస్పర కాల్పులు, దాడుల ఘటనలు జరుగుతూ ఉన్నా, మొత్తం మీద అనుకున్న విధంగా కాల్పుల విరమణ సాగుతోందని వాసింగ్టన్‌లో ట్రంప్ తెలిపారు. ఇరాన్ తమ చర్యలతో అమెరికాను బెదిరించాలని చూసింది. వారిని చిత్తుచేశామని చెప్పారు. హర్మూజ్ మీదుగా వెళ్లే తమ జాబితాలో లేని దేశాల నౌకలను గుర్తించి , వాటిపై భారీ సుంకాలు విధించేందుకు ఇరాన్ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇరాన్ ప్రత్యేకంగా ఓ సంస్థను అధికారికంగా ఏర్పాటు చేసుకుంది. అమెరికా ఇరాన్ మధ్య గత నెల నుంచి మొత్తం మీద కాల్పుల విరమణ ప్రక్రియ అమలులోకి వచ్చింది.