రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 121 రకాల మద్యం బ్రాండ్లకు నోటిఫికేషన్ ఇవ్వడంపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు మాత్రం ఫుల్ అంటూ ఎద్దేవా చేశారు. ఇదేనా మీరు చెప్పిన ప్రజా పాలన..? అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని, 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు మాత్రం ఆఘమేఘాల మీద విడుదల చేస్తోందని విమర్శించారు. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని ప్రభుత్వానికి, మద్యం వ్యాపారానికి మాత్రం ఇంత తొందర ఎందుకు..? అని ప్రశ్నించారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే.. మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధా..? అని ప్రశ్నించారు. యువత డిగ్రీలు, పిజీలు పూర్తి చేసి, జాబ్స్ కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం మద్యం షాపులు పెంచి, బ్రాండ్లు పెంచి, డబ్బు వసూలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. టైం కు యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేని ఈ చేతగాని సర్కారు.. మద్యం షాపులకు, బ్రాండ్లకు మాత్రం నోటిఫికేషన్ ఇస్తున్నదని పేర్కొన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మోసం..ఫీజు రీయింబర్స్ మెంట్ మోసం..రాజీవ్ యువ వికాసం.. వికసించక ముందే వాడిపోయిందని విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలకు గతి లేకుండా పోయిందని, రేవంత్ పగ.. యువత దగ అన్నట్లుగా తయారైందని వ్యాఖ్యానించారు.