మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ నాయకత్వాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. సొంత కారణాలతోనే విజయసాయిరెడ్డి వైసిపి నుంచి బయటకు వెళ్లారని.. పార్టీ వీడిన వారిపై తాము ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదని సజ్జల అన్నారు.విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యలపై సజ్జల స్పందిస్తూ.. 40 ఏళ్లుగా జగన్ వెంట ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారని సాయిరెడ్డి అనడం దారుణని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

పార్టీ నుంచి వెళ్లిన వారి గురించి జగన్ ఎప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడలేదని సజ్జల అన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే జగన్, వైసిపిపై విమర్శలు చేస్తున్నారని.. పబ్లిసిటీ కోసం సిఎం చంద్రబాబు చేసే ప్రయత్నాలను జగన్‌కు ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చింది జగనేనని, పార్టీకి సుదీర్ఘకాలం నాయకత్వం వహించే సత్తా ఉన్న నేత జగన్ ఒక్కరేనని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.