
హైదరాబాద్‌లో జాతీయ క్రీడలు 2002 లో డిసెంబర్ 13 నుంచి 22 జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డిసెంబర్ 22న ఆనాటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించినాడు. ఆయన ప్రసంగం ప్రారంభిస్తూనే ఖేల్ ఖతం -పైసా హజం అన్నాడు. హిందీ అర్థం కాని బాబుకి అదేదో ప్రశంస లాగా అనిపించి ఉంటుంది. ఆయన వ్యంగం అర్థం అయిన సభికులు నవ్వారు. అయితే పిసి ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు తర్వాత కింకర్తవ్యం ఏమిటి? అని ఆలోచించేటప్పుడు.. సందర్భమో, అసందర్భమో గాని వాజ్‌పేయీ పైమాటలు గుర్తుకు వచ్చాయి.
గత కొన్నేళ్లుగా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, లక్ష కోట్లు గంగలో కొట్టుకుపోయాయని, ప్రాజెక్టు రీ-ఇంజనీరింగ్‌లో అనేక అవకతవకలు జరిగాయని, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపాలు, డిజైన్ లోపాలు, నిర్వాహణ లోపాలు..ఇట్లా ఎన్నెన్నో ఆరోపణలపై కాగ్ (CAG), విజిలెన్స్ కమిషన్, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి లాంటి కేంద్ర, రాష్ట్ర అధికారిక సంస్థలు విచారణలు జరుపుతూనే ఉన్నాయి. వీటికి ఆవల తమని తాము పౌర సమాజం అని చెప్పుకునే తెలంగాణ జెఎసి, వ్యక్తిగత స్థాయిలో స్వయంప్రకటిత సాగునీటి రంగ నిపుణులు (ఇందులో సాగునీటి ఇంజనీర్లు ఎవరూ లేరని గమనించాలి), అంతర్జాతీయ మేధావులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలు నిర్వహించారు. తీర్పులు వెలువరించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద విషం చిమ్మినారు. ఈ విచారణల తతంగంలో చివరిఅంకం పిసి ఘోష్ కమిషన్ ది. హైకోర్టు తీర్పుద్వారా ఆ నివేదిక పరిస్థితి ఏమైయ్యిందో మనందరికీ ఎరుకే.
కాగ్ కొండను తవ్వి ఎలుకను మాత్రమే పట్టింది
కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే కాగ్ వారైతే కెసిఆర్ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే మూడేండ్ల పాటు భూతద్దాలు పెట్టుకొని ప్రాజెక్టులో అవినీతిని వెలికితీద్దామని విశ్వ ప్రయత్నాలు చేసింది. కాని కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కేంద్ర పాలక వర్గాలు ఆశించిన భారీ అవినీతిని వెలికితీయలేక చతికిలపడ్డారు. ఈ కాగ్ తవ్వకాల బృందంలో సభ్యులు మా ఇంజనీర్లకు మంచి స్నేహితులుగా మారినారు. అందులో ఉత్తర భారత రాష్ట్రానికి చెందిన ఒక అధికారి ఈ వ్యర్థపు కష్టానికి విసుగుపడుతూ క్యా కర్నాసాబ్. ఔర్ అందర్ జాకే జాంచ్ కరో, కుచ్ తో భ్రష్టాచార్ నికాలో .. ఐసే ఆదేశ్ దిల్లీ సే ఆయే హై, వహా కుచ్ భీ నహీ హైతో హం క్యా నికాల్ సక్తే! (ఇంకా లోపలికి వెళ్లి విచారణ జరపండి. ఏమన్నా అవినీతి సంబంధిత అంశాలు వెలికి తియ్యండి అని మాకు దిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయి. అక్కడ ఏమన్నా ఉంటే కదా వెలికి తీసేది!) అన్నాడు. వాళ్ళు ప్రాజెక్టులో నిర్మాణం అవుతున్న కట్టడాలను చూసి అబ్బురపడేవారు. తెలంగాణ ప్రభుత్వ దక్షతను పొగిడేవారు. తమ ఉత్తర భారత బీమారు రాష్ట్రాల అసమర్థ పాలనపట్ల తీవ్రమైన అసంతృప్తిని వెల్లడి చేసేవారు. ఆఖరుకు కాగ్ వెతికి పట్టుకున్నది ఏమిటయ్యా అంటే.. పంపులు, మోటార్ల తయారీలో BHELకు తక్కువ చెల్లించి కాంట్రాక్టు సంస్థకు ఎక్కువ చెల్లించారని, ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ చేసినందున ప్రాజెక్టు ప్రయోజనాలు ఖర్చుల నిష్పత్తి (BenefitCostRatio) 0.52 కు తగ్గిపోయిందని. అంటే ప్రాజెక్టు మీద ఒక రూపాయి ఖర్చు పెడితే తిరిగి వచ్చేది 52 పైసలేనట. వారికి కాళేశ్వరం ప్రాజెక్టులో పెరిగిన అంచనా వ్యయం మాత్రమే కనబడింది కాని ప్రాజెక్టులో పెరిగిన ఆయకట్టు, లిఫ్టింగ్ కెపాసిటి, నీటి నిల్వ సామర్థ్యం ఇంకా అనేక విసహాయాలు వారి కంటికి కనబడలేదు. అయితే కాగ్ వారు పిసి ఘోష్ కమిషన్ లాగా ఏకపక్షంగా ఆరోపణలు చేసి వివరణలు వినకుండా నివేదికలు ప్రచురించలేదు. వారు ప్రభుత్వం మీద చేసిన అన్ని ఆరోపణలను తెలియజేసినారు. వీటికి వివరణలు ఇచ్చే అవకాశాన్ని ఇచ్చినారు. రాత పూర్వక వివరణలు అన్నీ అయ్యాక ఫైనల్ హియరింగ్ జరిపారు. మన వాదనలు విన్నారు. అయితే వారు ప్రభుత్వ వివరణలను వేటిని పరిగణనలోకి తీసుకోకపోయినా కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ జరిపినామని ఆచరణలో చూపినారు. ఈ విచారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు కోట్లలోనే ఉంటుంది.
రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలో విజిలెన్స్ కమిషన్‌కు నాణ్యతా లోపాలు, డిజైన్ లోపాలు, నిర్వాహణ లోపాలు ఏవీ కనబడలేదు. డిసెంబర్ 7, 2023 తర్వాతనే ఇవన్నీ జరిగినట్టు వారికి జ్ఞానోదయం అయ్యింది. ఇక అప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో కనిపించినవన్నీ లోపాలే లోపాలు. ప్రాజెక్టు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో వందలాది ఫైళ్లను సీజ్ చేసి తీసుకుపోయారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ మొదలుకొని జూనియర్ ఇంజనీర్ వరకు వందలమంది ఇంజనీర్లకు నోటీసులు ఇవ్వడం ప్రారంభం అయ్యింది. ఇందులో విశ్రాంత ఇంజనీర్లు కూడా ఉన్నారు. వారి నుంచి వివరణలు తీసుకున్నప్పటికీ ఆఖరుకి వారందరినీ పైన చెప్పిన లోపాలకు బాధ్యులుగా నిర్ధారిస్తూ వారి మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరిపి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, వారి వార్షిక ఇంక్రిమెంట్లలో కోత పెట్టాలని సిఫారసులు చేస్తూ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ప్రభుత్వం వారందరికీ షోకాజ్ నోటీసులైతే జారీ చేసింది కాని క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు ఇంకా నిర్ణయం తీసుకున్నట్టు లేదు. అయితే అందులో ఇరుక్కున్న ఇంజనీర్లు మాత్రం ప్రమోషన్లు మాత్రం కోల్పోయినారు. ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించినందుకు వారికి ఈ శిక్ష. ఈ విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు కొన్ని కోట్లలోనే ఉంటుంది.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి విచారణ
వీరి తతంగం అంతా కూడా ‘కొండను తవ్వి ఎలకను కూడా పట్టని’ చందంగా మిగిలిపోయింది. తమ తొలి నివేదికను అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 అక్టోబర్ చివరి వారంలో సమర్పించింది. రెండో తాత్కాలిక నివేదికను పార్లమెంట్ ఎన్నికలకు ముందు 2024 ఏప్రిల్ లో సమర్పించారు. ఇందులో మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి నిర్మాణ లోపాలు ఉండవచ్చునని, నిర్వాహణ లోపాలు ఉండవచ్చునని, నాణ్యతా లోపాలు ఉండవచ్చునని, డిజైన్ లోపాలు ఉండవచ్చునని ఊహాగానాలు చేసినారు తప్ప నిర్దిష్టమైన కారణాలు ఇవీ అని చెప్పలేదు. ఒకటిన్నర సంవత్సరం పాటు విచారణ జరిపి ఇదమిత్థంగా ఏమీ తేల్చకుండా ‘సమగ్రంగా బ్యారేజీల వద్ద నిపుణులచే భూభౌతిక పరీక్షలు జరిపి, ఫలితాలను విశ్లేషించి, వాటి ఆధారంగా డిజైన్లను రూపొందించి పునరుద్ధరణ పనులు చేపట్టాలని సిఫారసు చేస్తూ మే 2025 లో తుది నివేదికను సమర్పించింది. ఇందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు కోట్లలోనే ఉంటుంది.
పిసి ఘోష్ కమిషన్ విచారణ
కమిషన్ విచారణ కూడా మార్చి 2024 నుంచి జులై 2025 వరకు.. అంటే 16 నెలల పాటు, 7 గడువు పొడిగింపులు పొంది, 118 సాక్షులను విచారించి, సాక్షులనే దోషులుగా నిర్ధారించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దోషులుగా నిర్ధారించే ముందు వారికి వివరణలు ఇచ్చుకునే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇవి విచారణ కమిషన్ చట్టం లో పొందుపరచిన హక్కులు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా రాష్ట్ర హైకోర్టు ఈ నివేదికను inoperative గా ప్రకటించింది. ఈ నివేదిక ఆధారంగా దోషులుగా నిర్ధారించిన పిటిషనర్లపై ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఆదేశించింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు రీ-ఇంజనీరింగ్ అంశాల విశ్లేషణలపై ఎక్కడా కూడా నిజాయితీ కనబడలేదు. తప్పుడు అన్వయాలు, వక్రీకరణలు, సాక్షుల అఫిడవిట్లను పట్టించుకోకపోవడం, ప్రాజెక్టు వ్యతిరేకుల అభిప్రాయాలనే నమ్మడం.. లాంటివి విస్తారంగా కనిపిస్తాయి. ముందుగానే నిర్ధారించుకున్న అభిప్రాయాలతో నివేదికను రూపొందించినట్టుగా అనిపించకమానదు. అందుకే హైకోర్టు ఈ నివేదికను inoperative గా ప్రకటించడాన్ని తెలంగాణ సమాజం స్వాగతించింది. కమిషన్ విచారణకు ప్రభుత్వ పెట్టిన ఖర్చు కోట్లలోనే ఉంటుంది.
కింకర్తవ్యం?
కాళేశ్వరం విచారణల తతంగంలో.. వాజ్‌పేయీ అన్నట్టు ‘ఖేల్ ఖతం-పైసా హజం’ అయ్యింది. ఇక ఈ విచారణల తతంగం ముగిసిందా? ప్రభుత్వం ఇంకా కొనసాగించదలచిందా? దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టతను కోరుతున్నది తెలంగాణ పౌర సమాజం. 23.04.26 న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్ళాలా వద్దా అన్న అంశంలో.. దిల్లీలో న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుందామని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా పత్రికల ద్వారా తెలిసింది. సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు పోవడం ద్వారా సాధించే ఫలితం ఏమీ ఉండదని, గతంలో సుప్రీం కోర్టు ఈ రకమైన కేసుల్లో వెలువరించిన తీర్పుల ఆధారంగానే హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది కాబట్టి అక్కడ కూడా ఇదే రకమైన తీర్పురావడం ఖాయం అని తెలంగాణలో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడినారు. ఇది నిజం కూడా.
ఇన్నాళ్ళు లక్ష కోట్లు గంగలో కలిసిపోయినాయని, కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని వర్ణించిన ప్రభుత్వ పెద్దలు ఎల్‌నినో ప్రభావం వలన రాబోయే కరువును ఎదుర్కోవడానికి కాళేశ్వరం తప్ప మరో ప్రత్యామ్నాయం ఏమీ లేదని గమనించినందు వలన కావచ్చు, మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇది స్వాగతించవలసిన విషయం. ప్రభుత్వం ముందు ఉన్న కింకర్తవ్యం కూడా అదే. విచారణల పేరిట ప్రజల డబ్బు ఇప్పటికే కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇక ఆ వివాదాలను అటకెక్కించి, భేషజాలకు పోకుండా, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను, రాబోయే కరువును ఎదుర్కోవడానికి బ్యారేజీల పునరుద్ధరణపై దృష్టి పెట్టడమే సరి అయిన నిర్ణయం అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలంగాణ పౌర సమాజం, రైతాంగం కూడా ఆశిస్తున్నారు.
శ్రీధర్‌రావు దేశ్‌పాండే
94910 60585












