
హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూ ప్రతిపాదించిన వన్-వే ట్రాఫిక్ నిబంధనల అమలుపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ఉదయం 7:00 గంటలకు కెబిఆర్ పార్క్ వాకర్లతో బహిరంగ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, ఐపీఎస్, ట్రాఫిక్ డిసిపి-II శ్రీమతి కాజల్, ఐపిఎస్ లతో పాటు పలువురు ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆగస్టు 18 నుండి అమలులోకి రానున్న నూతన ట్రాఫిక్ మార్పుల గురించి వాకర్లకు అధికారులు వివరించారు. కొత్త ట్రాఫిక్ విధానం సులభంగా, క్రమబద్ధంగా అమలయ్యేందుకు పార్క్ సందర్శకులు, వాహనదారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
వాకర్లకు ట్రాఫిక్ పోలీసుల ముఖ్య సూచనలు:
వాహనాలను కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో, మల్టీ-లెవల్ పార్కింగ్ సదుపాయంలో మాత్రమే నిలపాలి. ముఖ్యంగా ఉదయం వేళల్లో రోడ్డుకు ఎదురుగా (రాంగ్ రూట్లో) వాహనాలు నడపకూడదు. ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన సవరించిన నిబంధనలు, సూచనలను తప్పక పాటించాలి. వన్-వే ట్రాఫిక్ విధానాన్ని విజయవంతం చేసేందుకు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. నూతన ట్రాఫిక్ నిబంధనలపై కెబిఆర్ పార్క్ వాకర్ల నుండి సలహాలు, సూచనలను స్వీకరించేందుకు పార్క్ ముందు క్యూఆర్ కోడ్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రాకపోకలు సురక్షితంగా, వేగవంతంగా జరిగేందుకు పౌరులు, ముఖ్యంగా నిత్యం కేబీఆర్ పార్క్‌కు వచ్చే సందర్శకులు ఈ మార్పులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.











