తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిఎం విజయ్ నేతృత్వంలోని టివికె పార్టీకి మద్దతు విషయంలో అన్నాడిఎంకె పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. పళనిస్వామిని వ్యతిరేకిస్తూ అన్నాడిఎంకె రెబల్ వర్గం నేత షణ్ముగం, మరో నేత వేలుమణి.. ఎన్డియే కూటమికి గుడ్ బై చెప్పారు. అంతేకాదు, 24 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక వర్గాన్ని కూడగట్టారు. మంగళవారం ఉదయం షణ్ముగం మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడిఎంకె మేజర్ ఎమ్మెల్యేలు.. విజయ్‌కి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

ఇకపై ఎన్డీఏ కూటమికి మాకు సంబంధం లేదు, మేం బయటికి వచ్చేశాం. మాదే అసలైన అన్నాడిఎంకె. డిఎంకెతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామి కుట్ర చేశారు. పళనిస్వామి ప్రతిపాదనను మేం అంగీకరించలేదు. పళనిస్వామి మాకు విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే ఎన్డియే కూటమి నుంచి బయటకు వచ్చేశాం. వరుస ఓటములకు పళనిస్వామినే కారణం. పళనిస్వామి అన్ని పదవుల నుంచి దిగిపోవాలి అని షణ్ముగం పేర్కొన్నారు.

మరోవైపు.. తమిళనాడు అసెంబ్లీలో రేపు టివికె పార్టీ బలనిరూపణ ఎదుర్కోవాల్సి ఉంది. ఈ క్రమంలో అన్నాడిఎంకె రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.