
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోని బుచ్ జిల్లాపై రష్యా జరిపిన దాడిలో కనీసం 37 మంది మృతి చెందినట్టు అధికారులు శనివారంనాడు తెలిపారు. ఈ దాడిలో కనీసం 50 నివాస భవనాలు దెబ్బతిన్నాయని, భారీగా మంటలు చెలరేగి ఇళ్లు, ఓ రెస్టారెంట్‌కు వ్యాపించాయని స్థానిక ప్రాంతీయ సైనిక పరిపాలన అధిపతి టిముర్ త్కాచెంకో తెలిపారు. శుక్రవరాం రాత్రి 8 గంటల తర్వాత ఈ దాడి జరిగినట్టు అధికారులు చెబుతున్నరు. దాడి ఘటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒక ప్రకటనలో ధ్రువీకరించారు.
మైలా గ్రామంలోని ఓ గోదాముపై దాడి జరిగిందని, అనంతరం అక్కడ భారీ పేలుడు చోటుచేసుకుందని చెప్పారు. గోదాము గురించి పూర్తి వివరాలను ఆయన వెల్లడించనప్పటికీ ఇళ్లు, ఇతర నివాస ప్రాంతాలకు సమీపంలో మందుగుండు సామగ్రిని నిల్వ చేయకూడదనే నిబంధనలు అమల్లో ఉన్నట్టు చెప్పారు. రష్యా దాడిలో వృద్ధులు, వికలాంగుల కోసం నిర్వహిస్తున్న సంరక్షణ కేంద్రం, నివాస భవనాలు దెబ్బతిన్నాయని, ఇప్పటికే 370 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు.
కాగా, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ దీనిపై మాట్లాడుతూ, మైలా ప్రాంతంలోని గోదాములు దీర్ఘశ్రేణి డ్రోన్లకు సంబంధించిన విడిభాగాలు, ప్రయోగ బూస్టర్లు నిల్వ చేసి ఉండటంతో దానిని లక్ష్యంగా చేసుకుననట్టు తెలిపారు. మైకోలోవ్, ఇజ్మాయిల్ నౌకాశ్రయాలపై, కీవ్ ప్రాంతంలోని ఉక్రెయిన్ ‘ఫ్లామింగో’ క్రూయిజ్ క్షిపణులకు సంబంధించిన విడిభాగాలను నిల్వ చేసే లాజిస్టిక్ కేంద్రం, గోదాములపై దాడులు చేశామని చెప్పారు.
కీవ్‌లో నిరంతరంగా కొనసాగుతున్న వైమానిక దాడులు మూడో రోజుకు చేరుకున్నాయి. దీంతో ఉక్రెయిన్ రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. రష్యా పూర్తి స్థాయి దాడి ప్రారంభించిన నాలుగున్నరేళ్లకు పైగా గడిచినప్పటికీ సాధారణ ప్రజల జీవితం తీవ్రంగా ప్రభావితమమవుతోంది.








