
హైదరాబాద్: స్పీకర్ గడ్డం ప్రసాద్ పై హేయమైన భాష వినియోగించారని మంత్రి సీతక్క ఆరోపించారు. బిఆర్ఎస్ సభ్యుల తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన సభా సమావేశాల్లో సీతక్క మాట్లాడారు. స్పీకర్ ను అవమానించిన సభ్యులపై ఎస్సి, ఎస్టి కేసు పెట్టాలని, తాతా మధు వ్యాఖ్యలకు బాధ్యత వహించి.. మాజీ సిఎం కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ డైవర్షన్ లోనే బిఆర్ఎస్ సభ్యులు ఇలా మాట్లాడారని, బ్యాడ్ లాంగ్వేజ్ కు బ్రాండ్ అంబాసిడర్ కెసిఆర్ అని సీతక్క విమర్శించారు. దళితులంటేనే బిఆర్ఎస్ కు నచ్చదని, స్పీకర్ గా దళితుడు ఉండటం కెసిఆర్ కు నచ్చదని, దళితుడైన తమర్ని అధ్యక్షా అనాల్సివస్తుందని కెసిఆర్ అసెంబ్లీకి రావట్లేదని మండిపడ్డారు. గతంలో సిఎల్పి లీడర్ గా భట్టి విక్రమార్క ఉంటే ఓర్చుకోలేక తొలగించారని, గతంతో జగదీశ్వర్ రెడ్డి ఇలానే స్పీకర్ పై మాట్లాడారని సీతక్క ధ్వజమెత్తారు.








