పశ్చిమ బెంగాల్‌లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పతనం అనేది కేవలం ఒక ప్రాంతీయ పార్టీ ఓటమి లేదా మరో జాతీయ పార్టీ విజయం మాత్రమే కాదు. ఇది బెంగాల్ రాజకీయ సంసృ్కతిలో చాలా కాలంగా జరుగుతున్న లోతైన మార్పుకు ముగింపు ఘట్టంగా భావించవచ్చు. ఒకప్పుడు వర్గ చైతన్యంపై ఆధారపడిన సిద్ధాంతపరమైన సామూహిక రాజకీయాలు నడిచిన బెంగాల్‌లో, ఇప్పుడు వ్యక్తి ఆధారిత, ధ్రువీకరణకు లోనైన రాజకీయ పోటీ పెరిగింది. ఈ మార్పులో గుర్తింపు రాజకీయాలు, సంస్థాగత శక్తి, అధికార కేంద్రీకరణ వంటి అంశాలు కీలక పాత్ర పోషించాయి. బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కేవలం ఎన్నికల ఫలితంగా మాత్రమే చూడలేం. ఒకప్పుడు బలంగా ఉన్న వామపక్ష రాజకీయ సంసృ్కతి ఎలా క్రమంగా బలహీనపడింది, లోపలినుంచి ఖాళీ అయింది, చివరకు దాని స్థానాన్ని కఠిన జాతీయవాద రాజకీయాలు ఎలా ఆక్రమించాయన్న దానికి ఇది ఉదాహరణగా నిలిచింది. దశాబ్దాల పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు పశ్చిమ బెంగాల్ భిన్నంగా నిలిచింది.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) నేతృత్వంలోని వామపక్ష కూటమి పాలనలో బెంగాల్ ట్రేడ్ యూనియన్ రాజకీయాలు, లౌకికవాదం, మేధో చర్చలు, రైతాంగ ఉద్యమాలు, మతపరమైన రాజకీయాలపై అనుమాన దృక్పథానికి ప్రతీకగా నిలిచింది. ‘భద్రలోక్’ సంసృ్కతిపై ఎలిటిజం ఆరోపణలు ఉన్నప్పటికీ, సాహిత్యం, నాటకం, రాజకీయ చర్చలు, సిద్ధాంతపరమైన వాదోపవాదాలు ప్రజా జీవితంలో ముఖ్యస్థానం పొందిన ఉదారవాద సాంసృ్కతిక సంప్రదాయానికి అది ప్రతినిధిగా భావించబడింది. అయితే చరిత్రలో మార్పులు ఒక్కరోజులో రావు. వామపక్షాల బలహీనత 2011 ఎన్నికల ఓటమి కంటే చాలా ముందే ప్రారంభమైంది. రాష్ట్రంలో పారిశ్రామిక స్తబ్దత, అధికార యంత్రాంగ కఠినత్వం, పార్టీ వ్యవస్థలో పెరిగిన అహంకారం, యువత ఆశయాల నుంచి పార్టీ క్రమంగా దూరమవడం వంటి అంశాలు వామపక్ష కూటమి నైతిక ఆధారాలను దెబ్బతీశాయి. సింగూర్, నందిగ్రామ్ భూసేకరణ వివాదాలు ఈ పరిణామంలో కీలక మలుపుగా మారాయి. ఈ సమయంలో మమతా బెనర్జీ రైతులు, అణగారిన వర్గాల పరిరక్షకురాలిగా తనను ప్రజల ముందుంచడంలో విజయవంతమయ్యారు. మరోవైపు వామపక్ష ప్రభుత్వాన్ని అధికార కేంద్రీకృత, ప్రజల నుంచి దూరమైన వ్యవస్థగా చిత్రీకరించగలిగారు.

వామపక్షాలపై పోరాట సమయంలో మమతా బెనర్జీ అనుసరించిన అనేక రాజకీయ పద్ధతులే తరువాత ఆమె పాలనలో విమర్శలకు కారణమవడం రాజకీయాల్లోని పెద్ద విరోధాభాసంగా మారింది. వీధి హింస, తీవ్రమైన ప్రజాకర్షక రాజకీయాలు, వ్యక్తి పూజ ఆధారిత రాజకీయ సంసృ్కతి, భావోద్వేగాల ఆధారంగా ప్రజలను సమీకరించడం, సంస్థల విశ్వసనీయతను క్రమంగా దెబ్బతీయడం వంటి అంశాలు అప్పటి రాజకీయ పోరాటంలో ప్రధాన ఆయుధాలుగా మారాయి. తృణమూల్ కాంగ్రెస్ వామపక్షాలను కేవలం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒప్పించి ఓడించలేదు. నిరంతర సంస్థాగత పోరాటం ద్వారా వారి బలాన్ని క్రమంగా కూల్చివేసింది. అనేక గ్రామీణ ప్రాంతా ల్లో వామపక్ష కార్యకర్తలు భౌతిక దాడులకు గురయ్యారు. కొన్ని జిల్లాల్లో సిద్ధాంతపరమైన చర్చల స్థానంలో భయ రాజకీయాలు చోటుచేసుకున్నాయి.ఒకప్పుడు వామపక్షాలపై వచ్చిన రాజకీయ బెదిరింపుల ఆరోపణలు, తరువాత మరో రూపంలో తిరిగి కనిపించాయి. తరువాత జరిగిన పరిణామాలు ఆధునిక భారత రాజకీయాల్లో వ్యంగ్యం గా నిలిచాయి. వామపక్షాల అధికార కేంద్రీకరణ నుంచి ప్రజాస్వామ్య విముక్తి కల్పిస్తామని ముందుకు వచ్చిన శక్తి, క్రమంగా అవినీతి, ఆశ్రిత రాజకీయాలు, ఒకే నాయకురాలి చుట్టూ అధికార కేంద్రీకరణ ఆరోపణలు ఎదుర్కొనే పాలనగా మారింది.

మమతా బెనర్జీ ప్రభుత్వం పేద కుటుంబాలు, మహిళలకు చేరువైన అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయం నిరాకరించలేం. అయితే సంక్షేమంతో పాటు స్థానిక ప్రభావశీలులు, సిండికేట్ వ్యవస్థలు, విధేయత ఆధారిత నెట్‌వర్క్‌లపై ఆధారపడిన రాజకీయ సంసృ్కతి కూడా పెరిగింది. నియామక కుంభకోణాలు, ‘కట్ మనీ’ ఆరోపణలు వంటి అవినీతి వివాదాలు తృణమూల్ కాంగ్రెస్ నైతిక ప్రతిష్ఠను క్రమంగా దెబ్బతీశాయి. పట్టణ మధ్యతరగతి, యువతతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని కొంతమంది ఓటర్లలో కూడా ప్రభుత్వం అవినీతిపరమైనదిగా, భిన్నాభిప్రాయాలను సహించనిదిగా భావించే అభిప్రాయం పెరుగుతూ వచ్చింది. ఈ పరిస్థితులన్నీ కలిసి భారతీయ జనతా పార్టీకి చాలా కాలంగా ఎదురుచూస్తున్న రాజకీయ అవకాశాన్ని కల్పించాయి. బెంగాల్‌లో బిజెపి ఎదుగుదల పూర్తిగా సహజ రాజకీయ పరిణామం మాత్రమే కాదు. దాని వెనుక విస్తృత స్థాయిలో సంస్థాగత శక్తి వినియోగం, వ్యూహాత్మక రాజకీయ ప్రణాళికలు పనిచేశాయి.

బెంగాల్ అనేది మరో సాధారణ రాష్ట్ర ఎన్నిక కాదని, అది ఒక ప్రతీకాత్మక రాజకీయ విజయమని బిజెపి స్పష్టంగా అర్థం చేసుకుంది. హిందుత్వ రాజకీయాలకు దీర్ఘకాలంగా వ్యతిరేకంగా నిలిచిన చివరి ప్రధాన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకురావడం ద్వారా దేశవ్యాప్తంగా కాషాయ రాజకీయాలకు సిద్ధాంతపరమైన బలాన్ని అందించవచ్చని ఆ పార్టీ భావించింది. ఈ లక్ష్య సాధనలో అనేక రకాల వ్యూహాలు అమలులోకి వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు బెంగాల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాయి. తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచేందుకు ఎంపిక చేసిన దర్యాప్తులు, లక్ష్యంగా చేసుకున్న దాడులు, ఒత్తిడి రాజకీయాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేతలు పదేపదే ఆరోపించారు. ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణ, భద్రతా బలగాల మోహరింపు, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియల్లో ఎన్నికల సంఘం పాత్ర కూడా తీవ్ర వివాదాస్పదంగా మారింది.

ప్రత్యేకంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలు మైనారిటీలు, వలస జనాభాపై అధిక ప్రభావం చూపుతున్నాయని విమర్శకులు పేర్కొన్నారు. దీనివల్ల తమ ఓటు హక్కు కోల్పోతామన్న భయాలు ఆ వర్గాల్లో పెరిగాయి. ప్రస్తుతం బెంగాల్ రాజకీయ చర్చల స్వరూపం 1980లు, 1990ల కాలంతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. కార్మిక హక్కులు, వ్యవసాయ సంస్కరణలు, సామ్యవాద మార్పు వంటి అంశాలపై ఆధారపడిన రాజకీయ చర్చలు ప్రధాన ఎన్నికల రాజకీయాల నుంచి దాదాపు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో మతం, జాతీయవాదం, ప్రతీకాత్మక రాజకీయాలు, నాయకుల వ్యక్తిగత ఆధారిత రాజకీయాలు ముందుకు వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం సిపిఎం కార్యాలయం బయట ఉన్న వ్లాదిమిర్ లెనిన్ విగ్రహం ధ్వంసం చేయబడిన ఘటనను కేవలం సాధారణ రాజకీయ విధ్వంసంగా మాత్రమే చూడలేం. దానికి ఒక ప్రతీకాత్మక అర్థం ఉంది. విగ్రహాలు సాధారణంగా చరిత్ర, భావజాల వారసత్వం, రాజకీయ నిరంతరత్వానికి ప్రతీకలుగా భావించబడతాయి. లెనిన్ విగ్రహ ధ్వంసం బెంగాల్ వామపక్ష మేధో, రాజకీయ వారసత్వాన్ని క్రమంగా కూల్చివేయాలనే ప్రక్రియకు సంకేతంగా మారింది. బెంగాల్ సాంసృ్కతిక మార్పు ఇప్పటికే ప్రారంభమైందన్న హెచ్చరికగా కూడా అది కనిపించింది.

ఇప్పుడు బిజెపికి స్పష్టమైన శాసనసభ మెజారిటీ లభించిన నేపథ్యంలో ప్రభుత్వ అస్థిరతకు అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వాలపై ఆధారపడే పరిస్థితి కాకుండా, బలమైన కాషాయ ప్రభుత్వం దీర్ఘకాలిక సిద్ధాంతపరమైన ధైర్యంతో అధికారాన్ని వినియోగించే అవకాశముంది. దేశవ్యాప్తంగా గత అనుభవాలను పరిశీలిస్తే, బిజెపి ఒకసారి స్థిరమైన అధికారాన్ని సాధించిన తర్వాత కేవలం ఎన్నికల పరిపాలనకే పరిమితం కాకుండా, సాంసృ్కతిక పునర్నిర్మాణం వైపు కూడా అడుగులు వేయడానికి ప్రయత్నిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్, కాజీ నజ్రుల్ ఇస్లాం, సత్యజిత్ రే వంటి మహనీయుల బెంగాల్ హిందూ- ముస్లిం సహజీవనం, మేధో వైవిధ్యం, విప్లవాత్మక రాజకీయ ఆలోచనల సమ్మిళిత సంప్రదాయంతో రూపుదిద్దుకుంది.అయితే బిజెపి సిద్ధాంతపరమైన దృక్పథం ఎక్కువగా మెజారిటీ ఆధారిత జాతీయవాదాన్ని కేంద్రంగా చేసుకుని సాంసృ్కతిక ఏకరీకరణ వైపు సాగుతుందని విమర్శకులు భావిస్తున్నారు. ఈ రెండు భిన్న దృక్పథాల మధ్య ఉన్న ఘర్షణే భవిష్యత్తులో బెంగాల్ రాజకీయాలను నిర్దేశించే అవకాశముంది. బిజెపి అనుచరుల అభిప్రాయం ప్రకారం, దశాబ్దాలుగా కొనసాగిన అవినీతి, రాజకీయ హింస, ఆర్థిక స్తబ్దత నుంచి బెంగాల్ విముక్తి పొందాల్సిన అవసరం ఉంది. కాషాయ పాలనతో పరిశ్రమల పెట్టుబడులు పెరగవచ్చని, పరిపాలన బలోపేతం కావచ్చని, జాతీయ రాజకీయ ప్రవాహంతో రాష్ట్రం మరింత అనుసంధానమవుతుందని వారు విశ్వసిస్తున్నారు.

ముఖ్యంగా యువతలో ఒక వర్గం ప్రాంతీయ పార్టీల అవినీతి రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా బిజెపిని మార్పు శక్తిగా చూస్తోంది. అయితే విమర్శకులు మరింత లోతైన ప్రమాదాన్ని సూచిస్తున్నారు. బెంగాల్ బహుళ సాంసృ్కతిక గుర్తింపు క్రమంగా దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తీవ్ర మత ధ్రువీకరణ రాష్ట్ర సామాజిక నిర్మాణాన్ని శాశ్వతంగా మార్చివేసే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే రాజకీయ చర్చల భాష మరింత కఠినంగా, అసహనపూర్వకంగా, విభజనాత్మకంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.విశ్వవిద్యాలయాలు, సాంసృ్కతిక సంస్థలు, మీడియా వేదికలు కూడా క్రమంగా సిద్ధాంతపరమైన ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ చారిత్రక కూడలిలో నిలిచింది. మమతా బెనర్జీ పతనం కేవలం ఒక ప్రభుత్వానికి ముగింపు మాత్రమే కాదు. వామపక్షాల క్షీణతతో ప్రారంభమైన మొత్తం రాజకీయయుగానికి ముగింపు సంకేతంగా కూడా దీనిని చూడవచ్చు. కొత్త సిద్ధాంతపరమైన రాజకీయ వ్యవస్థలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో బెంగాల్ తన ప్రత్యేక సాంసృ్కతిక గుర్తింపును కాపాడుకోగలదా లేదా అన్నది ఇప్పటికీ అనిశ్చితంగానే ఉంది. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు తాను దేశ రాజకీయ, సాంసృ్కతిక రంగాల్లో ప్రత్యేకమైన మినహాయింపుగా భావించుకున్న బెంగాల్ ఇప్పుడు ఆ స్థితిలో లేదు. ఎర్రకోట క్రమంగా వెలిసిపోయింది. కాషాయ తరంగం అక్కడికి చేరుకుంది. భద్రలోక్ సంసృ్కతికి నిలయంగా పేరొందిన బెంగాల్ భవిష్యత్తు ఇప్పుడు జ్ఞాపకాలకూ, మార్పులకూ మధ్య నిలిచిపోయింది.


గీతార్థ పాఠక్

 (రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక,

రాజకీయ అంశాల విశ్లేషకుడు)