
సాగర్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి సుమారు 10 మంది మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారం ప్రకారం, బండా తసహసిల్లోని ఓ మద్యం దుకాణంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు శనివారం రాత్రి మద్యం తాగారు. ఇంటికి వచ్చిన వెంటనే అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పది మంది చికిత్స పొందుతూ మృతిచెందగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాథమిక దర్యాప్తులో ఈ మద్యం పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ నుంచి సరఫరా అయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తొలి మరణం ఆదివారం తెల్లవారుజామున నమోదైంది.
సమాచారం తెలిసిన వెంటనే సాగర్ డివిజనల్ కమిషనర్, ఐజీ, కలెక్టర్, ఎస్సీ తదితర ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వైద్య ఏర్పాట్లను పరిశీలించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రభావిత ప్రాంతాల్లోని ఏడు మద్యం దుకాణాలను జిల్లా యంత్రాంగం సీజ్ చేసింది. మద్యం నమూనాలను వెంటనే సేకరించి పరీక్షలకు పంపాలని ఆదేశించింది.
ఈ ఘటనపై సాగర్ కలెక్టర్ ప్రతిభా పాల్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని బండా తహసీల్‌లోని రెండు గ్రామాల్లో అక్రమ కల్తీ మద్యం సేవించి పది మంది మరణించినట్టు చెప్పారు. మృతదేహాలకు సంబంధించిన పోస్టుమార్టం నివేదికలు ఇంకా అందలేదని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వీరంద్ర లోధి మాత్రం కల్తీ మద్యం కారణంగా 11 మంది మరణించారని తెలిపారు.
లలిత్పూర్ నుంచి మద్యం సరఫరా?
ప్రాథమిక విచారణ ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ నుంచి మద్యం సరఫరా అయినట్టు తేలిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. లతిత్పూర్లో విషపూరిత కల్తీ మద్యం సరఫరా చేసే ఒక ముఠా ఉన్నట్టు సమాచారం అందిందని, సాగర్ జిల్లా యూపీ సరిహద్దుకు ఆనుకుని ఉండటంతో ఈ విషయం ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్టు కలెక్టర్ చెప్పారు.
బాధ్యులను వదిలిపెట్టం: సీఎం
కాగా, ఇది చాలా విషాదమైన, దురదృష్టకర ఘటన అని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్నారు. తక్షణం విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రి, అధికారులను ఆదేశించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు ముందు బీజేపీ పాలిత గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో గత నెలలో కల్తీ మద్యం ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది కల్తీ మద్యం సేవించి మరణించారు. మద్యం తయారీ, విక్రయం, వినియోగంపై నిషేధం ఉన్న డ్రై స్టేట్ అయిన గుజరాత్లో ఈ ఘటన చోటచేసుకోవడం కలకలం రేపింది.













