హైదరాబాద్: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో కల్తీ మసాలా తయారీ కేంద్రంపై ఎస్‌వొటి పోలీసులు, ఆహార కల్తీ పర్యవేక్షణ బృందాలు సంయుక్తంగా దాడులు చేశాయి. మేడిపల్లి శ్రీనివాస్ నగర్‌ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌పై పోలీసులు దాడి చేసి తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణంలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా తయారీ చేస్తున్నట్లు గుర్తించారు.

కారం పొడిలో ఏకంగా 30 శాతం చెక్క పొడి కలిపినట్లు.. స్వదేశీ స్వస్తిక్ బ్రాండ్ పేరుతో డూప్లికేట్ ప్యాకింగ్, లేబులింగ్ చేసినట్లు నిర్ధారించారు. ఒరిజినల్ బ్రాండ్‌ను పోలిన ప్యాకెట్లలో కల్తీ కారం పొడి విక్రయానికి సిద్ధం చేసినట్లు గుర్తించారు. వీటిని వివిధ వాణిజ్య సంస్థలు, వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు తేల్చారు. మొత్తం 10,890 కిలోల కల్తీ ఆహార పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఘటనలో నిర్వాహకులు సత్యనారాయణ, రుద్రశేఖర్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.