కష్టాల కన్నీళ్లను వేటితో కొలుస్తారో తెలియదు కానీ కొలమానముంటే అందరికంటే ఎక్కువ కష్టాల కన్నీళ్లు అమెరికా లోని భారతీయులకే. భారతీయుల అమెరికా ప్రయాణాన్ని పరిశీలించినట్లయితే, 1635లో మన దేశం నుండి జేమ్స్ టౌన్, వర్జినియా, అమెరికాకు మొదట వలసపోయిన వ్యక్తి ‘టామ్’ (హెడ్ రైట్) అని నమోదు చేయబడింది. 1680లో భారత సంతతి వ్యక్తి పీటర్, ఐరిష్ మహిళలకు జన్మించిన మేరీ ఫిషర్ స్థిరనివాసం పొందినట్లు తెలుస్తుంది. మన దేశస్థులు ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి రహిత సమాజం, మెరుగైన జీవన ప్రమాణాలు, అధిక జీతాలు, ఉన్నత విద్య, టెక్నాలజీ, పరిశోధనలకు సంబంధించిన ఉన్నతమైన ప్రమాణాలు ఉన్న అమెరికా సంస్థలలో పని చేయడానికి వలస వెళుతున్నారు. అమెరికన్ డ్రీమ్, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి సాధించాలనే తపనతో, భారత్‌లో ఉన్న విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ఉన్న అధిక పోటీ నుండి తప్పించుకొని, ఉత్తమ నైపుణ్యం కలిగిన ఐటి, ఆరోగ్య సంరక్షణ, కార్మిక నిపుణులు విజయవంతమైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు హెచ్1బి వీసాలు ఉపయోగించుకొంటున్నారు.

కష్టనష్టాలను భరించి అమెరికా వెళ్లి అక్కడి స్థానికులచే అవమానానికి గురైనప్పటికీ కష్టపడి పనిచేస్తూ సముచిత స్థానాన్ని సంపాదించుకుంటూ అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా, వ్యవస్థాపకులుగా అత్యంత విజయవంతమైన వలస సమూహాలలో ముఖ్యమైనదిగా ఉంటూ ప్రధానంగా టెక్నాలజీ, ఫైనాన్స్, తయారీ రంగాలకు నాయకత్వం వహిస్తున్నారు. 2025 -26 సమాచారం మేరకు వీరిలో ప్రముఖంగా ఉన్నటువంటి బిలియనీర్లు జై చౌదరి (Zస్కేలార్)- 17.9 బిలియన్ డాలర్లు, భారత సంతతి వారిలో అత్యంత ధనవంతుడు, వినోద్ ఖోస్లా (ఖోస్లా వెంచర్స్, సన్ మైక్రో సిస్టమ్స్)- 9.2 బిలియన్ డాలర్లు, రాకేష్ గంగ్వాల్ (ఇండిగో ఎయిర్లైన్స్)- 6.6 బిలియన్ డాలర్లు, రోమేష్ టి వాద్వానీ (సింఫనీ టెక్నాలజీ గ్రూప్)- 5.0 బిలియన్ డాలర్లు, నీరజా సేథి ( సింటెల్ సహవ్యవస్థాపకురాలు)- 1 బిలియన్ డాలర్లు, నేహా నార్ఖాడే (కాన్ఫలెంట్ సహ వ్యవస్థాపకురాలు), జయశ్రీ ఉల్లాల్ టెక్ (అరిష్ట నెట్‌వర్క్) మొదలైన పారిశ్రామికవేత్తలు, సిఇఒలు సత్యనాదెళ్ల (మైక్రోసాఫ్ట్), సుందర్ పిచాయి (ఆల్ఫాబెట్ గూగుల్), అరవింద్ కృష్ణ (ఐబిఎం), శంతను నారాయణ (అడోబ్), నీల్ మోహన్ (యూట్యూబ్) లాంటి మరెందరో ప్రముఖమైన వ్యక్తులు, రాజకీయ నాయకులను చూసినట్లయితే కమలహరిస్, నిక్కీ హేలి, వివేక్ రామస్వామి, ప్రమీల జైపాల్, అమీబేరా, రోఖన్న, రాజ కృష్ణమూర్తి, శ్రీతానేదార్, సుభాష్ సుబ్రహ్మణ్యం, గజాల హస్మి, విన్ గోపాల్ మొదలైన వారితో పాటు 16 ఫార్చున్ -500 కంపెనీలకు భారతీయ సిఇఒలు నాయకత్వం వహిస్తున్నారు.

72యూనికార్న్ కంపెనీలకు భారతీయులు నేతృత్వం వహిస్తున్నారు. భారతీయ సంతతి కుటుంబాల సగటు ఆదాయం అత్యధికం 119000 అమెరికా డాలర్లు. రతన్ టాటా సహాయ సహకారాలతో శ్రీకాంత్ బోల్ల స్థాపించిన ‘బోలాంట్ ఇండస్ట్రీ’ పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేస్తుంది. షలబ్ కుమార్ వంటి వారు రాజకీయ, వ్యాపారాల రెండింటిలో ప్రావీణ్యమున్నది. 2026 నాటికి అమెరికాలో 54 లక్షల (అమెరికాలో జన్మించిన, వలస వచ్చిన) కు పైగా భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో భారతీయ సంతతి వలసదారులు 32 లక్షలకుపైగా, అమెరికా జనాభాలో 1.5%. సంఖ్యా, ఆర్థికపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా సమూహాలలో మనమొకరం. కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్ లలో భారత సంతతి ప్రజలెక్కువ. అమెరికాలో 10% భారతీయ వైద్యులే పనిచేస్తున్నారు. భారత సంతతికి చెందిన 11% యూనికార్న్ కంపెనీలకు భారతీ సంతతివారే వ్యవస్థాపకులు. అమెరికాలో మన వాళ్లు ఎంతగా రాణించినప్పటికీ వారు ఎన్నెన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కార్నెగి నిర్వహించిన సర్వేలో అమెరికా వదలాలని అక్కడి భారత సంతతిలోని 40% మంది కోరుకుంటున్నట్లు వెల్లడించింది.

ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగం సంపాదించడం, స్థిరనివాసం ఏర్పరచుకోవడం భారతీయుల కల, కానీ ప్రస్తుతం ఆ కల నెమ్మదిగా చెదిరిపోతుంది, అగ్రరాజ్యంలో ఇక ఉండలేమని భారతీయ సంతతి వారి మనోవేదన, అక్కడి పరిస్థితులతో రోజురోజుకు వారిలో ఆందోళన, భయం పెరిగి, మేము తిరిగి భారతకు వెళ్ళిపోతామన్నారు. అక్కడి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులే దీనికి కారణమని భావిస్తున్నారు. యూగవ్, కార్నెగి ఎండోమెంట్స్ సంస్థ 1000 మంది భారతీయులను సర్వే చేసి అభిప్రాయం సేకరించగా 40% భారతీయ అమెరికన్లు మళ్లీ మేము భారత్ వెళ్లిపోతామని వెల్లడించగా, 14% మంది వెళ్లిపోవాలని తరచుగా ఆలోచిస్తున్నామని, 28% మంది అప్పుడప్పుడు అలా అనిపిస్తుందని చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై 58% మంది తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. పెరిగిన జీవన వ్యయాన్ని భరించలేకపోతున్నామని 54% మంది వెల్లడించారు, రోజురోజుకూ వ్యక్తిగత భద్రత కష్టంగా ఉందని 41% ఉంది చెప్పారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు భారత పక్షపాతిగా భావించారు. కానీ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, వలస విధానాలు, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రభుత్వ నిర్ణయాలు తమకు నచ్చడం లేదని 71% మంది ప్రకటించారు.

ట్రంప్ జాత్యహంకార మాటలు మాట్లాడుతూ, అమెరికన్స్ ఫస్ట్ అంటూ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రకరకాలుగా ప్రకటనలు చేస్తూ అమెరికన్లనే కాకుండా అమెరికాలో స్థిరపడిన, పనిచేస్తున్న, చదువుకుంటున్న విదేశీయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని ఈ వారం ప్రారంభంలో తాను నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 70% మంది ప్రజలు తెలిపినట్లు ఎపి ఎన్నో ఆర్‌సి సంస్థ వెల్లడించింది. దేశం సరైన పంథాలో సాగడం లేదని 72% మంది అభిప్రాయం పడినట్లు తెలియజేసింది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో మార్చి నెలలో ట్రంప్ కున్న ప్రజాదరణ 38% కానీ ఏప్రిల్ వచ్చేసరికి అది కాస్త 30% పడిపోయింది. జీవన వ్యయం విషయంలో కేవలం 23% మంది మాత్రమే ట్రంప్ కు అనుకూలం, 76% మంది ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వాక్ స్వాతంత్య్రం ప్రకారం తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెలువరించిన ఒక రాజకీయ విశ్లేషకుని పోస్టును బాధ్యత గల అమెరికా అధ్యక్షుడు రి పోస్ట్ చేయడమంటే ఆ అధ్యక్షుని మదిలో విదేశీయులపై ఉన్న దురాభిప్రాయం ఇట్టే తెలిసిపోతుంది. ఎంతో కష్టపడి ఎన్నో కలలతో అమెరికా వెళ్ళిన భారతీయులకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడాన్ని జీర్ణించుకోలేక స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చే మేధావుల విజ్ఞానాన్ని మన దేశాభివృద్ధికి ఉపయోగించుకునేటట్లు అవకాశాలు కల్పించాలి.


డా. కావలి చెన్నయ్య, 90004 81768