శ్రీలంకలో 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై 71 ఏళ్ల సీనియర్ బౌద్ధ సన్యాసి పల్లెగమ హేమరత్నను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కేసులో బౌద్ధ సన్యాసి అరెస్టు కావడం సంచలనం కలిగించింది. అనురాధపుర లోని ప్రముఖ ఆలయ ప్రధాన పూజారి అయిన ఆయనను అనురాధపుర మెజిస్ట్రేట్ కోర్టు అరెస్టు వారంట్ జారీ చేయడంతో శుక్రవారం రాత్రి అదుపు లోకి తీసుకున్నారు. నిందితుడికి సహకరించినందుకు బాధితురాలి తల్లిని కూడా అరెస్టు చేశారు. బాధితురాలి వయసు ఇప్పుడు 15 సంవత్సరాలు. అనురాధపుర ఆలయ ఆవరణలో బాలికపై లైంగిక వేధింపులు జరిగాయని పోలీస్ అధికార ప్రతినిధి ఎఫ్‌టి వూట్లర్ విలేకరులకు చెప్పారు.

ఈ సంఘటనపై గత మార్చిలో ఫిర్యాదు నమోదైంది. ఇది మొదట ఒక చిన్నారి అపహరణ, నిర్బంధానికి సంబంధించిన కేసు అని డైలీ మిర్రర్ మీడియా పోర్ట్లల్ నివేదించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించేసరికి మరిన్ని వివరాలు బయటపడ్డాయి. అనురాధపుర కు 200 కిమీ దూరంలో రాజధాని కొలంబోలో ప్రైవేట్ ఆస్పత్రి ఎమర్జెన్సీ యూనిట్‌లో నిందితుడు చికిత్స పొందుతుండగా ఈ అరెస్టు జరిగింది. ఆయన తల్లిని కూడా అరెస్టు చేశారు. ప్రాచీన నగరమైన అనురాధపుర లో పవిత్ర క్షేత్రాల సముదాయం ఆటమస్థానకు చెందిన ప్రముఖ అగ్ర బౌద్ధ సన్యాసిగా హేమరత్న గుర్తింపు పొందారు. ఈ బౌద్ద క్షేత్రాలను ఏటా అనేక మంది బౌద్ద బిక్షువులు సందర్శిస్తుంటారు.