
మన తెలంగాణ/హైదరాబాద్: తుంగభద్ర నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి, భాగస్వామ్య రాష్టాలతో సమన్వయ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర డ్యామ్, నదీ ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టిఎంసీల నీరు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అయిదారు టిఎంసీలకు మించి రావడం లేదని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ కింద జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉందని మూడు రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఎపి, కర్ణాటక నీటి వాటాల సమర్ధ వినియోగానికి కేంద్ర జల సంఘం (సీడబ్లూసీ) సారథ్యంలో తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలని సిఎం కోరారు. కర్ణాటకలోని విజయనగర జిల్లా హోస్పేట్ (హోసపేట) పరిధిలోని తుంగభద్ర డ్యామ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 33 స్పిలేవే గేట్లను నేడు ఉదయం 11 గంటలకు కర్ణాటక సిఎం డికె శివకుమార్ ప్రారంభించనుండగా ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు పాల్గొననున్నారు.
అనంతరం మునీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే ప్రజా సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపి మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సిఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్డీఎస్ ఆనకట్ట ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనులను అత్యవసరంగా గుర్తించాలని సిఎం కోరారు. రాజోలి బండ డైవర్సన్ కెనాల్ ఆధునికీకరణకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 59 కోట్లు డిపాజిట్ చేసిందని, పనులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు.
తుంగభద్ర ఎత్తిపోతల పథకం కింద సాధ్యమైనంత నీటిని వినియోగించుకునేలా
ప్యాకేజీ 1,2 పనులు ఇప్పటికీ చేపట్టలేదని, ప్యాకేజీ 3, 4 పనులు మాత్రం పూర్తి అయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిలిచిపోయిన మొదటి, రెండు ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలని నేడు కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ముగ్గురు సిఎంలతో జరిగే సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని ఆయన నిర్ణయించారు. ఆర్డీఎస్ వద్ద తెలంగాణ భూభాగం వైపు పూడిక నిండిపోవడం వల్ల ఆశించిన విధంగా నీటిని మళ్లీంపు సాధ్యం కావడం లేదని ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2004లో నిపుణుల కమిటీ పూడిక తొలగించాలని సూచించిందని, ఆ కమిటీ ఇచ్చిన సిఫారసులు ఇప్పటికి అమలు కాలేదని అధికారులతో సిఎం చర్చించారు. వెంటనే పూడిక తీసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పూడిక పేరుకున్న భూభాగం కర్ణాటకలో ఉండటంతో ఆ రాష్ట్ర సహకారం కోరాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. పూడికతీతతో పాటు 2004లో నిపుణుల కమిటీ ఇచ్చిన
సూచనలను అమలు చేయాలని కేంద్రానికి వినతి పత్రం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో పేర్కొన్నారు. అప్పటి నివేదికకు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితిని విశ్లేషించుకోవాలని సిఎం సూచించారు. వెంటనే పూర్తి వివరాలతో నివేదికను తయారు చేయాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. తుంగభద్ర ఎత్తిపోతల పథకంలో భాగంగా సాధ్యమైనంత నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను అదేశించారు. తుమ్మిళ్ల నుంచి నీటిని వినియోగించుకునేందుకు కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెపాసిటీ పెంచాలని, వీలైనంత వేగంగా పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి అదేశించారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని 5 నుంచి 6 టిఎంసీలకు పెంచే అవకాశాలను, అవసరమైతే అదనపు భూసేకరణ చేపట్టే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రెండుదశల్లో అమలు చేయాలి
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రెండుదశల్లో అమలు చేయాలని ఈ సమావేశంలో ప్రణాళిక రూపొందించారు. మొదటి దశలో మూడు పంప్ హౌస్‌ల నిర్మాణం, రెండో దశలో మల్లమ్మకుంటతో సహా మూడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా నీటి లభ్యతను పెంచి సాగునీటి స్థిరత్వాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్డీఎస్ వ్యవస్థకు కనీసం వచ్చే 15 నుంచి 20 సంవత్సరాల అవసరాలను తీర్చగల శాశ్వత పరిష్కారాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. 2004లో నిపుణుల కమిటీ చేసిన పలు సిఫార్సులను కూడా పునఃసమీక్షించారు. కాలువ ప్రవేశద్వారం వద్ద పేరుకుపోయిన సిల్ట్ మట్టిని తొలగించడం, సరైన గ్రేడియెంట్లను పునరుద్ధరించడం, నీటి ప్రవాహాన్ని సజావుగా జరిగేలా చర్యలు చేపట్టడం, నదీ ప్రవాహాన్ని స్థిరీకరించేందుకు రివెట్మెంట్ పనులు చేపట్టడం వంటి అంశాలను కీలక సిఫార్సులుగా చర్చించారు. ఆర్డీఎస్ నీటి వనరులో మళ్లీ సిల్టింగ్ జరగకుండా నివారించేందుకు నిపుణుల కమిటీ సూచించిన విధంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతిక అంచనాల ప్రకారం కొన్ని
పరిస్థితుల్లో నదీ ప్రవాహంలో గణనీయమైన భాగం ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లీపోవడం వల్ల తెలంగాణ కాలువ హెడ్ వద్ద నీటి లభ్యత తగ్గుతోందని అధికారులు వివరించారు.తక్షణ చర్యగా డ్రెడ్జింగ్ (పూడిక తొలగింపు) చేపట్టడం అత్యంత ఆచరణ సాధ్యమైన పరిష్కారాల్లో ఒకటిగా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. కాలువ హెడ్ వద్ద పేరుకుపోయిన సిల్ట్‌ను శాస్త్రీయంగా తొలగించడం ద్వారా కీలక సాగు కాలాల్లో నీటి ప్రవాహాన్ని మెరుగుపరచవచ్చని ఇంజనీర్లు వివరిం చారు. డ్రెడ్జింగ్, కాలువ హెడ్ అభివృద్ధి పనులు, ఆధునీకరణ చర్యలు, ప్రత్యామ్నాయ ఎత్తిపోతల పథకాలు, అంతర్రాష్ట్ర సమన్వయ వ్యవస్థలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్డీఎస్ ఆయకట్టుపై ఆధారపడిన రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం కాగితాలపై నీటి కేటాయింపులు ఉండటం సరిపోదని, కేటాయించిన నీరు రైతుల పొలాలకు చేరేలా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.









