ఘటనపై పోలీసుల ఆరా

మనతెలంగాణ / సిటిబ్యూరోః మైనర్ బాలికపై ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ అత్యాచారం చేశాడన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన ఎంఐఎం పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీపై వేటు విధించడం నగరంలో సంచలనం సృష్టించింది. అయితే బాలికపై లైంగిక వేధింపులతోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారన్న వార్తలు కలకలం రేపుతున్నా... సస్పెన్షన్‌కు సరైన కారణాలను పార్టీ వెల్లడించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అత్తాపూర్‌లో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విషయం తెలుసుకున్న స్థానికులు సదరు ఎమ్మెల్సీని పట్టుకుని చితకబాదినట్లు సమాచారం. ఈ విషయం నగరంలో పెను సంచలనం సృష్టించడంతో ఎంఐఎం పార్టీ అధిష్టానం అప్రమత్తం అయింది. పరిస్థితి చేయిదాటకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఎంఐఎం అధిష్టానం ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని ఆదేశించి, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాకపోవడం విశేషం. ఓ ఎమ్మెల్సీ ఎంతటి దారుణానికి పాల్పడినా బాధితులెవరు ముందుకు రాకపోవడం, కేసు నమోదు కాకపోవడం మరో విశేషం. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఘటన ఎక్కడ జరిగింది, బాధితులు ఎవరనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజేపి నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశాయి.