మన తెలంగాణ/హైదరాబాద్‌ః ‘మీకు వ్యతిరేకంగా కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది సురేఖ అక్కా ..’ అని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మంత్రి కొండా సురేఖను ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతున్నదని మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆయన ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సురేఖ అయినా తానైనా, మరెవరైనా పార్టీ తర్వాతేనని ఆయన తెలిపారు. ముందు పార్టీని కాపాడుకోవాలని, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతూ ముందుకు వెళతామని ఆయన పేర్కొన్నారు.

పార్టీ గీత దాటితే కడియం శ్రీహరిపైనా చర్యలు తప్పవని ఆయన తెలిపారు. పార్టికి నష్టం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన వివరించారు. అయితే తనపై పార్టీలో కుట్ర జరుగుతున్నదని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి లేదని పేర్కొన్నారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా, వ్యాఖ్యానించినా పిసిసి, ఏఐససి క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరించారు.

ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. మంత్రి సురేఖకే కాకుండా చిన్నారెడ్డికీ నోటీస్ ఇచ్చిన విషయాన్ని గమనించాలని ఆయన తెలిపారు. తప్పు చేస్తే ఎవరినీ పార్టీ నాయకత్వం ఉపేక్షించదని, చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. సామాజిక న్యాయం పాటించేది కాంగ్రెస్ పార్టీలోనే అనే విషయాన్ని ఎవరూ మరిచిపోరాదని, బిసిలని, అగ్ర కులాలనీ ఏమీ చూడరని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.