
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈవెంట్ టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామన్న సిఎం సువేందు ప్రకటించారు. గత ఏడాది కోల్‌కతాలోని యువ భారతి స్టేడియంలో జరిగిన మెస్సీ కార్యక్రమం కోసం టిక్కెట్లు కొనుగోలు చేసిన సుమారు 33,000 మంది ఫుట్‌బాల్ అభిమానులకు రాష్ట్ర క్రీడా బడ్జెట్ నుండి టిక్కెట్ డబ్బును తిరిగి చెల్లిస్తామని సువేందు తెలిపారు.
హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా 'నబన్నా'లో జరిగిన ప్రత్యేక జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో అధికారి మాట్లాడుతూ.. డిసెంబర్ 13, 2025న జరిగిన ఈ కార్యక్రమం కోసం రూ.4 వేలు, రూ.6 వేల ధరలతో టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు పరిహారం చెల్లించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు.
"మెస్సీకి భారీ అభిమానులు ఉన్నారు. వారు వేల రూపాయల పెట్టి టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఈ 33,000 మంది క్రీడాభిమానులు చెల్లించిన డబ్బును తిరిగి వారికి అందేలా చూడాలన్నది నా కోరిక. నేను ఇప్పటికే దీనికి సంబంధించిన అంతర్గత ప్రక్రియను మొదలుపెట్టాను. ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయగలనని ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు.
కాగా, యువ భారతి స్టేడియంలో మెస్సీ ఈవెంట్ లో నిర్వహణ లోపాలు, గందరగోళం నెలకొంది. ఈ గందరగోళానికి అప్పటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ క్రీడా మంత్రి అరూప్ బిస్వాస్ అతిగా జోక్యం చేసుకోవడమే ప్రధాన కారణమని.. ఈవెంట్ ను నిర్వహించడంలో ప్రభుత్వం విఫమైందని విమర్శలు వచ్చాయి. ఈ కార్యక్రమం తర్వాత వేలాది మంది ప్రేక్షకులు తమ టిక్కెట్ డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజాగా టికెట్ కొన్న ఫుట్ బాల్ అభిమానులకు డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు సిఎం అధికారి తెలిపారు.








