బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ జ్యోతిబాఫూలే కళాశాలలో ఆదివారం రాత్రి 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో పిల్లలకు విరేచనాలై అస్వస్థకు గురయ్యారు. దీంతో హుటాహుటిన రాత్రి 11 గంటలకు పాఠాశాల సిబ్బంది విద్యార్థులను అంబులెన్స్‌లో బాన్సువాడ ఏరియా ఆసుపత్రి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ సోమవారం ఉదయం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ఫుడ్ పాయిజన్‌కు గల వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ శివకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. కళాశాల సిబ్బంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి వారి యోగ క్షేమలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

 పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కూడా గడవక ముందే...

బీర్కూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే కళాశాల విద్యార్థులు అస్వస్థతకు గురికావడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కూడా గడవక ముందే ఇంత నిర్లక్ష్యమా అని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని పలువురు వ్యక్తులు డిమాండ్ చేస్తున్నారు.