వారి ధైర్యం, పట్టుదల అభినందనీయమన్న రాహుల్ గాంధీ

విద్యార్థులతో సంభాషించిన వీడియో షేర్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘హింసాత్మక పాలన’కు ఎదురొడ్డి నిలిచిన విద్యార్థుల ధైర్యం అభినందనీయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ‘బీజేపీ గూండాల’ దురుసు ప్రవర్తన, మాటల దాడి, హింసను ఎదుర్కొన్న బాలికలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ గత నెలలో నిరసనలు చేపట్టిన విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. జూలై 20న పోలీసులు తమపై దౌర్జన్యం చేశారని విద్యార్థులు ఆరోపించారు.

ఈనెల ప్రారంభంలో రాహుల్‌గాంధీ వారితో సమావేశమయ్యారు. వీడియోతో పాటు హిందీలో చేసిన పోస్ట్‌లో రాహుల్ మాట్లాడుతూ, జవాబుదారీతనం కోరుతూ మోదీ ‘హింసాత్మక పాలన’కు ఎదురొడ్డి నిల్చిన విద్యార్థుల ధైర్యం, పట్టుదల అభినందనీయమని అన్నారు. శాంతి, ప్రేమ,హాస్యంతో యువత తమ వాణి వినిపించారని చెప్పారు. ‘బీజేపీ గూండాల అనుచిత ప్రవర్తన, మాటల దాడి, హింసను ఎదుర్కొన ప్రతి ఒక్క యువకుడు, ముఖ్యంగా బాలికలను చూసి నేను గర్విస్తున్నాను. ప్రధాని క్షమాపణ చెప్పేలా ఆయనపై ఒత్తిడి తెచ్చారు’ అని రాహుల్ అన్నారు. ఇప్పుడు వారి గొంతులను ఎవరూ అణిచివేయాలేరని అన్నారు. ఆగస్టు 22న పుణెలో ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాన్ని తాము కేవలం బాలికల కోసం నిర్వహిస్తున్నామని, ఇప్పుడు బాలికలు మాట్లాడతారని, యావద్దేశం వింటుందని పేర్కొన్నారు.