
మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తగిన సాయం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం ప్రజా భవన్లో మూసీ పునర్జీవన కెబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులను మధుపార్క్ రిడ్జ్ (బి -బ్లాక్) రెసిడెన్షియల్ అసోసియేషన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ వినతులను మంత్రులకు సమర్పించారు. నివాసితులు వ్యక్తం చేసిన సందేహాలు, అపోహలను మంత్రులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా డిప్యూటి సిఎం మాట్లాడుతూ మధుపార్క్ రిడ్జ్ బి -బ్లాక్ నివాసితులందరి విషయంలో ప్రభుత్వం అత్యంత సానుకూల
దృక్పథంతో ఉందన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, వారికి మెరుగయిన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నగరవాసులకు స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చదనం అందించేందుకు చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని వారిని డిప్యూటి సిఎం కోరారు. ప్రభుత్వ హామీ పట్ల అసోసియేషన్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. మూసీ పునర్జీవనానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మూసీ ప్రాజెక్ట్ ఎండి ఈ.వి. నర్సింహారెడ్డి, జాయింట్ ఎండి గౌతమి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, మధుపార్క్ రిడ్జ్ అసోసియేషన్ అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జి.వి. శేఖర్, సభ్యులు సత్యనారాయణ, గౌతమ్ రాయ్, రేణుధల్, నబీ సాహేబ్, సాహిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.















