
నాంపల్లిలోని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో బుధవారం విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు బోర్డు కార్యాలయంలోని పలు విభాగాల్లో రికార్డులు, ఫైళ్లను పరిశీలించారు. 2019 ఇంటర్ ఫలితాల్లో గ్లోబరీనా సంస్థ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాడు సుమారు తొమ్మిది లక్షల మంది పరీక్షలు రాయగా, అందులో సుమారు మూడు లక్షల మంది ఫెయిల్ కావడం, మార్కుల్లో తప్పులు దోర్లడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో ఈ వ్యహారంపై గతంలో కేసులు నమోదు అయ్యాయి.ఈ క్రమంలో సిఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.
దీంతో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగలోకి దిగారు. అధికారులు ఇంటర్ బోర్డు కార్యాలయంలో సుమారు ఐదు గంటలకు పైగా తనిఖీలు చేపట్టారు. ఇంటర్ బోర్డు మాజీ కార్యదర్శి అశోక్‌ను సైతం విజిలెన్స్ అధికారులు విచారించారు. ప్రధానంగా తనిఖీల్లో భాగంగా ఇంటర్ విద్యకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు, విద్యార్థుల సేవలు, పరీక్షలు, సర్టిఫికెట్లు, అనుబంధ కళాశాలలకు సంబంధించిన రికార్డులు తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఆయా విభాగాల్లో ఉన్న పత్రాలను పరిశీలించడంతోపాటు సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.








