
మన తెలంగాణ/హైదరాబాద్: ‘జన ఆగ్రహ సభ’ పేరిట బిజెపి ఆదివారం (10న) పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించను న్న బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై విరుచుకుపడనున్నారు. ప్రధాని మోడీ రాక సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ‘టార్గెట్ తెలంగాణ’గా ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై వాగ్బాణాలు సంధించనున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో మూ డు రాష్ట్రాల్లో ము ఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించడంతో బిజెపి రాష్ట్ర నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం ద్విగుణీకృతమైం ది. పశ్చిమ బెంగాల్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృత్తం అయ్యేలా ఇప్పటి నుంచే శ్రమించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వనున్నారు.
ప్రధాని ప్రసంగించే అంశాల్లో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి చేసిన కార్యక్రమాలు విడుదల చేసిన నిధులు, ఇంకా చేపట్టనున్న పథకాలు, విడుదల చేయనున్న నిధుల గురించి చెబుతూనే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వైపల్యాలపై బాణా లు సంధించనున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. రైతుల గోస, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయకపోవడం, శాంతి-భద్రతలకు కలుగుతున్న విఘాతం వంటి ముఖ్యాంశాలను ప్రధాని తన ప్రసంగంలో చెప్పేలా ప్రసంగం పాఠాన్ని రాష్ట్ర నాయకులు సిద్ధం చేశారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభ తర్వాత పార్టీలో ఉత్సాహం రెట్టింపు అవుతుందన్న నమ్మకాన్ని పార్టీ రాష్ట్ర నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని రాక సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద ఎత్తున జన సమీకరణకు సిద్ధమయ్యారు. జిల్లాలు, మండల స్థాయి నుంచి జన సమీకరణ చేసే స్థానిక పార్టీ నాయకులు వారి ప్రాంతాల్లోనే ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం సూచన చేసింది. ఆదివారం సెలవు కావడం వల్ల స్థానికంగా ఉండే విద్యా సంస్థల బస్సుల కోసం ఆయా యాజమాన్యంతో మాట్లాడుకుని సిద్ధం చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు జన సమీకరణకు పెద్ద ఎత్తున ప్రైవేటు వాహనాలనూ వారు సిద్ధం చేసుకున్నారు. ప్రతి మండలం నుంచి ఎనిమిది వందల మందిని, ప్రతి డివిజన్ నుంచి మూడు వందల మందిని పరేడ్ గ్రౌండ్‌కు తీసుకుని వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని పార్టీ నాయకత్వం సూచించింది. ఇందులో మహిళలు వంద మంది ఉండేలా చూసుకోవాలని సూచించింది.
రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలూ పెద్ద ఎత్తున తరలి రానున్నందున ఆ తాకిడిని తట్టుకునేలా పార్టీ రాష్ట్ర నాయకులు ఏర్పాట్లు చేశారు. చుట్టు పక్కల జిల్లాల నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్ తదితరులు తరచూ పరేడ్ గ్రౌండ్‌ను సందర్శిస్తూ పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ భారీగా ఏర్పాట్లు చేశారు.
పోలీసుల అధీనంలో గ్రౌండ్
ప్రధాని నరేంద్ర మోడీ రానున్నందున పరేడ్ గ్రౌండ్‌ను మొత్తం ఎన్‌ఎస్‌జి, రాష్ట్ర పోలీసులు క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. వేదిక ఇంకా చుట్టూర మూడు వందల మీటర్ల వరకూ పోలీసులు స్వాధీనం చేసుకుని కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్‌లోకి ప్రవేశించే మార్గాల్లో అత్యంత ఆధునికమైన మెటర్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. చిన్న గుండు సూది తెచ్చినా, మెటల్ డిటెక్టర్ శబ్ధం చేయడంతో పాటు పక్కనే ఉండే సిస్టం స్క్రీన్‌పైనా స్పష్టంగా కనిపిస్తుంది.
సాధువుల కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్
ఇదిలాఉండగా పలువురు పీఠాధిపతులు సభకు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 250 మంది సాధువులకు ప్రత్యేకంగా పాసులు జారీ చేశారు. అంతేకాకుండా వారి కోసం ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేశారు.
వేదికపై 45 నిమిషాలు..
భద్రతా కారణాల దృష్టా ముందుగా ప్రధాని పర్యటన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. అయితే పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ప్రధాని మోడీ ఆదివారం బెంగళూరు నుంచి మధ్యాహ్నం 2.30 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. పార్టీ ప్రముఖలందరిని కలిసిన తర్వాత హెలికాప్టర్‌లో హెచ్‌ఐసిసికి 3.25 నిమిషాలకు చేరుకుంటారు. 3.30 నుంచి 4 వరకు హెచ్‌ఐసిసిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో ప్రధాని పాల్గొంటారు. ఆ తర్వాత 4.10 నిమిషాలకు సాయి సింధు ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ 4.15 నుంచి 4.45 వరకు సాయి సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 5.10 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.15 నుంచి 6.15 వరకూ ప్రధాని మోడీ కార్యక్రమాన్ని వెల్లడించకుండా రిజర్వ్‌డ్‌గా పెట్టారు. సాయంత్రం 6.30 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ నిమిషాల 45 నుంచి గంట సేపు వేదికపై ఉంటారు. అనంతరం రాత్రి 7.40కి బేగంపేట విమానాశ్రయం నుంచి గుజరాత్ చేబయలుదేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆ గంట ఏమి చేస్తారు ?
ఇప్పుడు అనధికారికంగా వెల్లడించిన ప్రధాని పర్యటన వివరాల ప్రకారం బేగంపేట విమానాశ్రయంలో గంట సేపు రిజర్వ్‌డ్ అని పెట్టారు. దీంతో ప్రధాని మోడీ ఆ గంట సేపు ఏమి చేయనున్నారన్న చర్చ పార్టీలో జరుగుతున్నది. అయితే రాష్ట్రానికి చెందిన ఇరువురు కేంద్ర మంత్రులతో పాటు పార్టీ రాష్ట్ర నాయకులతో ప్రధాని సమావేశం కానున్నారేమోనని వారు భావిస్తున్నారు. గంట సేపు పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశమైన రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధాని ఆరా తీయనున్నారా ?, పశ్చిమ బెంగాల్ తరహాలో పాచికలు వేసేందుకు ఏ మేరకు అవకాశం ఉంది ? అని చర్చిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. అయితే ప్రధానితో భేటీ కావడానికి రాష్ట్ర ముఖ్య నాయకుల జాబితా ఇవ్వాలని ఇప్పటి వరకూ ప్రధాని కార్యాలయం నుంచి సంకేతం ఏదీ రాలేదు.














