
ఇటీవల పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు సంచలనమైన ఫలితాలు అందించాయి. దేశంలో పశ్చిమంనుండి తూర్పువరకు బిజెపి తన పట్టును నిలబెట్టుకునే అవకాశం కలిగి దేశ రాజకీయ చిత్రాన్ని మార్చివేశాయి. అయితే పాలనలో ఉన్న ప్రభుత్వాలు కుప్పకూలిపోవడానికి ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత పథకాలు ఎంతవరకు అభివృద్ధికి దోహదం చేస్తాయో చర్చలోకి రావడం లేదు. ఈ అంశం కొత్త ప్రభుత్వాల ముందు సవాలుగా నిలిచింది. పశ్చిమబెంగాల్‌ను తీసుకుంటే పశ్చిమబెంగాల్ తలసరి ఆదాయంలో మిగతా రాష్ట్రాల కన్నా చాలా తక్కువ స్థానంలో ఉంది. ఈ విషయంలో హర్యానా 3వ స్థానం, గుజరాత్ 5వ స్థానంలో ఉండగా, బెంగాల్ 16వ స్థానంలో ఉండడం గమనార్హం. ఆ రాష్ట్రాల స్థాయికి ఇప్పుడు బిజెపి సారథ్యంలో బెంగాల్ ఎదగడం సాధ్యమవుతుందా? అన్నదే ప్రశ్న.
ఎన్నికల్లో ప్రకటించిన ఉచిత పథకాల వల్ల నిజమైన అభివృద్ధి లభిస్తుందా? తృణమూల్ కాంగ్రెస్ జనరల్ కేటగిరి మహిళలకు నెలకు రూ. 1500, రిజర్వుడు కులాల మహిళలకు నెలకు రూ. 1700 వంతున ఉచితంగా నగదు పంపిణీ చేసేది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం కులాలతో సంబంధం లేకుండా మహిళలందరికీ నెలకు రూ. 3000 వంతున నగదు పంపిణీ చేస్తామని ప్రకటించింది. బెంగాల్లో దాదాపు 100 మిలియన్ జనాభాలో 49.3 శాతం మంది మహిళలు ఉన్నారు. వీరిలో 35.8 మిలియన్ మంది 20 ఏళ్లు పైబడిన వారే. దీని బట్టి ఈ పథకం అమలు లోకి వస్తే దాదాపు రూ. 1.29 లక్షల కోట్లు ఖర్చవుతుంది. 2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూ. 3.56 లక్షల కోట్ల వరకు ఉండగా, ఈ ఒక్క హామీ నెరవేర్చడానికే మొత్తం బడ్జెట్ వ్యయంలో మూడోవంతు భరించవలసి వస్తుంది. ఈ హామీని అమలు చేయకతప్పదనుకుంటే అభివృద్ధి పనులకు బడ్జెట్లో కేటాయించిన వ్యయాన్ని ఏమాత్రం తగ్గించకుండా ఉచిత హామీ నిబద్ధతకు నిధులు ఎలా వస్తాయో ప్రభుత్వమే యోచించాలి? ఉచిత హామీలకే అంతభారీగా వెచ్చించవలసి వచ్చినప్పుడు అభివృద్ధి మందగించవా? బెంగాల్లో ప్రస్తుతం ఉన్న అవకాశాలను వనరులను ఉపయోగించుకుని అభివృద్ధి పరంగా, రాజకీయంగా బలోపేతం కాగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో బహుముఖ పేదరికం తలసరి నిష్పత్తి 2005 06 లో 58 శాతం వరకు ఉండగా, 2022 23లో 9 శాతం మాత్రమే ఉందని నీతి ఆయోగ్ నివేదిక 2024లో వెల్లడించింది. పేదరికం గణనీయంగా తగ్గినప్పటికీ, తలసరి ఆదాయం (పిసిఐ) మాత్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాల కల్పన ఎండమావియేనా? నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3000 వంతున భృతి కల్పిస్తామని బిజెపి తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇది తాత్కాలిక ప్రయోజనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. ఉద్యోగాలు కల్పించే వాతావరణం అమరితేనే ప్రైవేట్ సంస్థలు రాష్ట్రంలో అడుగుపెట్ట గలుగుతాయి. అంతే కాదు స్థిరంగా నిలదొక్కుకోగలుగుతాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే టివికె అధినేత, నటుడు అనూహ్య విజయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. విజయ్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల బిల్లు అమలు పర్చితే రూ. 0.99 లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి వెచ్చించాల్సివస్తుంది. 0.99 లక్షల కోట్లు అంటే 99 వేల కోట్లు. తమిళనాడు బడ్జెట్ రూ. 3.93 లక్షల కోట్లు కాగా, అందులో దాదాపు రూ. లక్ష కోట్లు ఉచిత హామీలకే ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఈ రాష్ట్రం 2001 నుంచి 2026 వరకు దేశం మొత్తం మీద ఆరో అత్యధిక సగటు వార్షిక వృద్ధి రేటును నమోదు చేసినప్పటికీ సంక్షేమ పథకాలపైన ఆధారపడి జీవించే సామాన్యులకు, పేద ప్రజలకు జిడిపి వృద్ధి (ఆర్థిక వృద్ధి) చేరడం లేదు. వాస్తవ సంక్షేమం కన్నా ఈ ఉచిత హామీలే ఓట్లును రాబట్టడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. అయితే వేగవంతమైన వృద్ధి నమూనా కంటే ఉచిత హామీల అమలే పేదరికం నిర్మూలనకు ఎక్కువ దోహదం చేస్తున్నాయన్న అభిప్రాయం రాజకీయ పార్టీల్లో కనిపిస్తోంది. ఏ ప్రభుత్వమైనా అలాంటి ప్రయోజనాలను సాధించాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతవరకు బలంగా ఉందో పరిశీలించడం అవసరం. తామిచ్చిన హామీలకు కావలసిన నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలో అన్న భవిష్య దృక్పథం మరింత అవసరం. మింగమెతుకు లేదాయే మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఉచిత హామీలకే అంతా వెచ్చించుకుపోతే అసలైన అభివృద్ధి అన్నది అంగుళమైనా ముందుకు సాగక, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది.
దేశంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన పెద్ద రాష్ట్రాల్లో రెండో రాష్ట్రంగా పశ్చిమబెంగాల్ ఉంటోంది. మొత్తం రుణ బకాయిల చెల్లింపులకు సంబంధించి 2026లో జిడిపిలో 38.9 శాతం వరకు ఉంది. పశ్చిమబెంగాల్ కన్నా పంజాబ్‌లో రుణ బకాయిల చెల్లింపులు జిడిపిలో 46.4 శాతం వరకు ఉంటున్నాయి. అంటే జాతీయ సరాసరి రుణ బకాయిల చెల్లింపు 29.2 శాతం ఉండగా, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు రుణ బకాయిల స్థాయి ఏ విధంగా ఉందో గమనించవచ్చు. కొత్త ప్రభుత్వాలకు ఈ ఆర్థిక ప్రతిబంధకాలే పెద్ద సవాలు. ఉచిత హామీలతో ఈ ప్రతిబంధకాలు మరింత భారంగా తయారయ్యాయి. ఒకవైపు అభివృద్ధి వ్యయంతో, మరోవైపు సంక్షేమ పథకాల వ్యయాన్ని తులనాత్మకం చేసుకోవడం కొత్త ప్రభుత్వాలకు అగ్నిపరీక్షే కానున్నాయి.















