
శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎక్కువగా నోబాల్స్ వేశాడు. 2021 నుంచి ఇఫ్పటివకూ జడేజా దాదాపు 85 నోబాల్స్ వేయడం గమనార్హం. ఇక ఈ సిరీస్‌తో ఆరంగేట్రం చేసిన సారాంశ్ జైన్ కూడా కొన్ని నోబాల్స్ వేశాడు. .ఇదే విషయమై స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతలే మాట్లాడుతూ ‘టెస్టుల్లోనూ నో బాల్ వేస్తే ఫ్రీహిట్ ఇస్తే బాగుంటుంది’ అని అన్నారు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఓ కీలక సూచన చేశారు. ఇలా పదే పదే నోబాల్స్ విసిరే బౌలర్లపై చర్యలు తీసుకోవాలని.. అదే సమయంలో బౌలింగ కోచ్‌ను కూడా బాధ్యుడిని చేయాలని అన్నారు.
‘‘ఇటీవల నో బాల్స్‌ను వేయడంపై చర్చ సాగుతోంది. ఇది అత్యంత కీలక విషయమని గుర్తించాలి. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలదు. ఆటగాళ్లు కొన్నింటిని కంట్రోల్ చేయగలరు. బ్యాటర్ అయితే గార్డ్‌ను తీసుకోవడం.. అదే బౌలర్‌గా నో బాల్స్ వేయకుండా ఉండటం. ఇప్పుడున్న కాలంలో ప్రతి దానిని గణించడం జరుగుతుంది. అలాంటప్పుడు బౌలింగ్ క్రీజ్‌ను ఎందుకు దాటాలి. ఈ తప్పిదాలు క్షమించరానివి’’ అని గావస్కర్ వ్యాఖ్యానించారు.
‘‘భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సరదాగా ఆ వ్యాఖ్యలు చేశాడు. నో బాల్ వేసిన తర్వాత ఫ్రీ హిట్ అంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఉంటుంది. టెస్టులనూ ఆ దారిలోకి తీసుకెళ్లొద్దు. ఇలా చేయడం వల్ల పరుగులు రాబట్టడం బ్యాటర్లకు తేలికగా మారుతుంది. అలా కాకుండా.. ప్రతి నో బాల్‌కు బౌలర్‌కు జరిమానా విధించాలి. ఆ సంఖ్య పెరుగుతూ ఉంటే రెట్టింపు చేయాలి. అదే సమయంలో సగం జరిమానాను బౌలింగ్ కోచ్‌కూ విధించాలి. ఆ నిధులను జట్టు డిన్నర్ కోసం కేటాయించాలి. ఇతర అంశాల్లోనూ ఫైన్‌లు వేయాలి. ఫీల్డింగ్ సరిగా చేయకపోయినా కూడా విధించాలి. అందుకోసం ఓటింగ్ పెట్టాలి. ఇలాంటివి జట్టులో ఫన్‌ను తీసుకొస్తాయి. ఆటగాళ్ల మధ్య సఖ్యత పెంచుతాయి’’ అని గావస్కర్ సూచించారు.








