న్యూఢిల్లీ : ఓలా ఎలక్ట్రిక్ సామాన్య ప్రజలను ఆకట్టుకునేందుకు రూ. 79,999 ప్రారంభ ధరతో కొత్త ఎస్1జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 46160 ఎల్‌ఎఫ్‌పి భారత్ సెల్ సాంకేతికతతో ఈ స్కూటర్ పనిచేస్తుంది. ఇది 3.1 కెడబ్లుహెచ్, 5.1 కెడబ్లుహెచ్ అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభ్యమవుతుంది. 3.1 కెడబ్లుహెచ్ మోడల్ సింగిల్ ఛార్జ్‌పై 179 కిలోమీటర్ల పరిధిని ఇస్తుండగా, దాని ధర రూ. 79,999 గా ఉంది. 5.1 కెడబ్లుహెచ్ మోడల్ 301 కిలోమీటర్ల పరిధిని అందిస్తూ రూ. 99,999 ధరకు లభిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఓలా సిఇఒ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ, భారత్ సెల్ సాంకేతికత ద్వారా విద్యుత్ వాహనాల తయారీ వ్యయాన్ని తగ్గించి, సామాన్యులకు సైతం నాణ్యమైన ఈవి రవాణాను అందుబాటులోకి తేవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 3.1 కెడబ్లుహెచ్ వర్షన్ డెలివరీలు 2026 డిసెంబర్‌లో ప్రారంభం కానుండగా, 5.1 కెడబ్లుహెచ్ మోడల్ 2027 మార్చి నాటికి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.