
బంధువుల ఇంటికి వెళ్లొచ్చేసరికి దొంగలు ఇళ్లు ఖాళీ చేశారు. 30 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.5 లక్షల నగదుతో పరారయ్యారు. ఈ సంఘటన గోషామహల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షాహినాయత్‌గంజ్ ముల్తానీపురాలో చోటుచేసుకున్నది. ఇన్‌స్పెక్టర్ శ్రవణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... బేగంబజార్‌లోని స్టీల్ దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న మహేష్ భార్యాపిల్లలతో కలిసి షాహినాయత్‌గంజ్ ముల్తానిపురాలోని 3వ అంతస్తులో నివాసం ఉంటున్నాడు. 2వ అంతస్తులో అతని తమ్ముడు, మొదటి అంతస్తులో తల్లి, గ్రౌండ్ ఫ్లోర్‌ను స్టోర్ రూమ్‌గా వాడుకుంటున్నారు. లంగర్‌హౌజ్‌లో బంధువుల వివాహం ఉండటంతో మహేష్ గత నాలుగు రోజులుగా ప్రతి రోజూ ఉదయం కుటుంబసభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లి, అర్దరాత్రి సమయానికి తిరిగి ఇంటికి వస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి పెళ్లికి వెళ్లిన మహేష్ స అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో ఇంటికివచ్చి చూడగా,
ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించాడు. అనుమానంతో గబగబా మూడవ అంతస్తు పైకి చేరుకోగా ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. బీరువాలో గల 30 తులాల బంగారం, 30 తులాల వెండితో పాటు రూ.5 లక్షల నగదు, ఇతర సామగ్రిని దొంగలు దోచుకువెళ్లినట్లు గ్రహించాడు. వెంటనే మహేశ్ గోషామహల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు క్లూజ్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. గోషామహల్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్రవణ్‌కుమార్‌లు చోరీకి గురైన ఇంటిని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ టీవీ పుటేజీలను సేకరించి ఆధారాల కోసం పరిశీలిస్తున్నారు. అయితే, తెలిసినవారే రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు సుమారు రూ.50 లక్షల సొత్తు చోరీకి గురైందని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.














