
‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్’ పేరు వింటేనే 2.60లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల వెన్నులో వణుకు పుడుతుంది. ఈ స్కీమ్‌తో తమ బ్రతుకులకు భరోసాలేదని వారు ఆందోళన చెందుతున్నారు. 2001-02 బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు ఉద్యోగ విరమణానంతరం ఇచ్చే పెన్షన్ లో మార్పు చేయడానికి బి.కె. భట్టాచార్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ప్రతిపాదనలను 2003 ఆగస్టు 23వ తేదీన నాటి ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన యూపిఏ ప్రభుత్వం 2004 జనవరి 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో చేరిన ఉద్యోగులకు నూతనంగా నేషనల్ పెన్షన్ (ఎన్పీఎస్) విధానం అమల్లోకి తెచ్చింది. 2004 సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కొలువులో చేరిన సుమారు 2.60లక్షల మంది ఉద్యోగులు సిపిఎస్ పింఛన్ పథకం పరిధిలోకి వచ్చారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్య కాదు. దేశవ్యాప్తంగా సుమారు 97లక్షల మంది ఉద్యోగులు సిపిఎస్ పింఛన్ స్కీమ్ పరిధిలో ఉన్నారు. అయితే అనాధిగా అమల్లో ఉన్న ఓల్డ్ పెన్షన్ విధానంలోకి వచ్చే ఉద్యోగులకు ఎంప్లాయిస్ కాంట్రిబ్యూషన్ లేకుండానే ఉద్యోగి రిటైర్‌మెంట్ తర్వాత చివరి బేసిక్ మూల వేతనం నుంచి 50 శాతం సర్వీసు పెన్షన్ రూపంలో అందుతుంది. అలాగే తనకు వచ్చిన పెన్షన్ నుంచి 40 శాతం సొమ్మును ఏకకాలంలో తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. దీంతో ఉద్యోగికి, అతని కుటుంబానికి రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఓ భరోసా దొరికేది.
కానీ, సిపిఎస్ పెన్షన్ స్కీం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు పెన్షన్ ఓ టెన్షన్ అయి కూర్చుంది. ఎందుకంటే సిపిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల పెన్షన్ షేర్ మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి ఉంటుంది. దీంతో పదవి విరమణ పొందిన సిపిఎస్ ఉద్యోగి రిటైర్‌మెంట్ జీవితం ప్రశ్నార్థకమైంది. రాజ్యాంగంలోని 309వ అధికరణ ద్వారా అందించబడిన అధికారాలను ఉపయోగించి చత్తీస్ ఘడ్, రాజస్థాన్, జార్కండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఓల్డ్ పింఛన్ విధానం (ఓపిఎస్)ను అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం “వన్ నేషన్, వన్ ట్యాక్స్” నినాదం ప్రతిధ్వనిస్తున్న మన దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పెన్షన్ చట్టాలు అమలు జరుగుతుండటం విచారకరం. కేంద్ర ప్రభుత్వం మెమో - 41 ప్రకారం ప్రభుత్వం 2019 నుంచి ప్రభుత్వ వాటాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచింది. అలాగే మెమో - 57 ప్రకారం 2004 కు ముందు నోటిఫికేషన్‌ల ద్వారా తదనంతరం ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. గెజిట్ నెంబర్ -178 ప్రకారం 2021 నుంచి చనిపోయిన కేంద్ర ప్రభుత్వ ఎన్‌పిఎస్ ఉద్యోగుల నామినీకి ప్రాన్ అకౌంట్లో ఉన్న ఉద్యోగి కాంట్రిబ్యూషన్ కు చెందిన సొమ్మును ఉద్యోగి కుటుంబానికి ఇస్తూ వారి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ ను మంజూరు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సంస్కరణల్లో ఏ ఒక్క సంస్కరణను కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదు. అలాగే సిపిఎస్ తో ఆర్థిక భద్రత కోల్పోవడంతో పాటు రిటైర్‌మెంట్ తర్వాత హెల్త్‌కార్డు సదుపాయం లేని ఆరోగ్య భద్రత ను కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఓపిఎస్ విధానంలో ఒక ఉద్యోగి సర్వీస్ కాలాన్ని బట్టి దాదాపుగా చివరి నెల బేసిక్ సాలరీలో 50 శాతం ప్రతినెల పెన్షన్ తో పాటు డిఏ పెరుగుదల మాదిరిగానే డిఆర్ కూడా వర్తిస్తుంది.
అయితే సిపిఎస్ విధానంలో ఉద్యోగి పర్మినెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ (ఫ్రాన్) లోని మొత్తంలో 40 శాతం నిధిని ప్రభుత్వం అన్యుటీలలో పెట్టిబడి పెట్టి దానిపై వచ్చే రాబడి రూ.లక్షకు సుమారు రూ.500ల నుంచి రూ.800 మాత్రమే వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి పీఎఫ్‌ఆర్డీఏ-2004 (పింఛన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలఫ్‌మెంట్ అథారిటీ) చట్ట ప్రకారం సిపిఎస్ పరిధిలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మూల వేతనం నుంచి 10శాతం, డిఏలో 10శాతం ప్రతినెల ఉద్యోగి పర్మినెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్లో జమ చేయాలి. అంతేస్థాయిలో ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో ఉద్యోగి పర్మినెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ (ఫ్రాన్) లో జమ చేయాలి. ఇలా జమ అయిన పెన్షన్ సొమ్మును సిఆర్‌ఏ (సెంట్రల్ రికార్డు కీపింగ్ ఏజెన్సీ) బాధ్యతగా నిర్వహించి ఈ నిధిని నేషనల్ పెన్షన్ సిస్టం ట్రస్టు (ఎన్పీఎస్), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిట్స్ లిమిటెడ్ (ఎన్‌ఎస్డీఎల్) ద్వారా షేర్ మార్కెట్ లో పెట్టి తదుపరి పదవీ విరమణ సమయంలో సర్వీస్ మొత్తంలో ఉద్యోగి, ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీత సొమ్మును నెలవారీగా రిటైర్డ్ ఉద్యోగికి పింఛన్ రూపంలో చెల్లించాలి. కానీ, తెలంగాణలో ఈ ప్రక్రియ కూడా సక్రమంగా జరగడం లేదు.
ఉద్యోగికి చెల్లించే ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌ను నిర్ణిత గదువులోపు చెల్లించని కారణంగా పెన్షన్ సెటిల్‌మెంట్ జరగని కారణంగా రాష్ట్రం లో సుమారు 600 మంది రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు ఆ కొద్దిపాటి నెలవారి పెన్షన్ కూడా రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా సిపిఎస్, ఎన్‌పిఎస్ పథకాలకు ప్రత్యామ్నయంగా యూపిఎస్ (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పెన్షన్ పథకం) ను అమల్లోకి తీసుకువచ్చింది. 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త పెన్షన్ పథకం వర్తిస్తుంది. దీని ప్రకారం ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్ పే సగటులో 50 శాతం కచ్చితంగా పింఛన్ రూపంలో అందుతుందని కేంద్రం పేర్కొంటుంది. కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మూల వేతనంలో 50 శాతం పెన్షన్ రానుంది. మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది. కానీ, పెన్షన్‌కు కనీస అర్హత సుమారు 10 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకోవాలి. ఉద్యోగి 10శాతం వాటాతో పాటు ప్రభుత్వం క్రమం తప్పకుండా మ్యాచింగ్ గ్రాంట్ చెల్లించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకంను అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ, అదనపు భారంను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది.
సీనియర్ జర్నలిస్టు బూడిద సుధాకర్
76809 92342








