మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం వాడీవేడీగా జరిగింది. నీటి పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే, చర్చల్లో ఏ కాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు రాష్ట్రాలకు కెఆర్‌ఎంబి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎపి పునర్విభజన చట్టం- 2014లోని 11వ షెడ్యూల్ లో 2, 3 పేరాలను అనుసరించి నీటిని వినియో గం ఉండాలని సూచించింది. సాగునీరు, - త్రాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి విరుద్ద పరిస్థితులు వస్తే, త్రాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కెఆర్‌ఎంబి సూచించింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించడం వెంటనే నిలిపి వేయాలని త్రాగునీటి అవసరాలకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నీటిని వినియోగించాలని కెఆర్‌ఎంబి ఆ దేశించింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం నీటిని వినియోగించడంపై కెఆర్‌ఎంబి అభ్యంత రం వ్యక్తం చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి వి డుదలను నియంత్రించాలని కెఆర్‌ఎంబీ సూచించింది.

ఉమ్మడి జలాశయాల్లో నీరు తక్కువగా ఉ న్నందున పొదుపుగా వాడుకోవాలని కెఆర్‌ఎంబీ ఆదేశించింది. సెప్టెంబర్ నాలుగోవారంలో మరోసారి భేటీ కావాలని కెఆర్‌ఎంబీ నిర్ణయించింది. శుక్రవారం రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాల తో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటి నిల్వలపై చర్చించేందుకు హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిస భ్య కమిటీ సమావేశం జరిగింది. కెఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ కాంబోజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమే శ్‌బాబు, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నరసింహమూర్తితో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన ఇం జనీర్లు హాజరయ్యారు. ప్రస్తుత నీటి లభ్యత, తాగునీటి అవసరాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల పరిస్థితి, నీటి విడుదలపై ఈ సమావేశంలో చర్చించారు. కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కెఆర్‌ఎంబీ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. దీంతోపాటు కృష్ణా జలాల అంశంపై ప్రతిష్టంభన వీడలేదు. కెఆర్‌ఎంబీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పూర్తి స్థాయి బోర్డు సమావేశంలోనే నీటి వాటాలను తేల్చాలని కెఆర్‌ఎంబీ నిర్ణయించింది.

ఇరు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో సమానంగా నీటిని కేటాయించాలి: తెలంగాణ ఇరిగేషన్ అధికారులు

ప్రస్తుతం బోర్డు పరిధిలోని ఉమ్మడి జలాశయాల్లో 142 టిఎంసీల మేర లభ్యత ఉండగా, తాగునీటి అవసరాల దృష్ట్యా ఇరు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో సమానంగా నీటిని కేటాయించాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కెఆర్‌ఎంబీని కోరారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కెఆర్‌ఎంబీకి సూచించారు. ఈ పరిస్థితుల్లో పాత 66:34 నిష్పత్తిని అమలు చేయడం సరికాదని తెలంగాణ కెఆర్‌ఎంబీ ఎదుట తెలంగాణ అధికారులు వాదించారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా తెలంగాణకు మొత్తం 200 టిఎంసీల నీరు అవసరమని, అందుకు అనుగుణంగా నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కెఆర్‌ఎంబీని కోరారు.

ఎపి అధికారుల వాదనలపై తెలంగాణ అధికారుల అభ్యంతరం

అయితే, ఆంధ్రప్రదేశ్ మాత్రం గతంలో ఉన్న తాత్కాలిక ఏర్పాటు ప్రకారం 66:34 నిష్పత్తిలోనే వాటాలు కేటాయించాలని పట్టుబట్టడంపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా ఎపి అక్రమంగా భారీగా నీటిని తరలించిందని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఆరోపించగా, నిబంధనలకు కట్టుబడే నీటిని తరలిస్తున్నామని ఎపి అధికారులు పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు, వెలిగొండ సహా ఇతర మార్గాల ద్వారా ఎక్కువ నీటిని తరలించుకుంటు న్నారని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయగా శ్రీశైలం వద్ద తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తి చేసి దిగువకు నీటిని వాడుకుంటున్నారని ఎపి అభ్యంతరం వ్యక్తం చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా ఎపి నీటిని తరలిస్తోంది: తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్, రమేశ్ బాబు

66:34 నిష్పత్తిని మూడేళ్లుగా తెలంగాణ అంగీకరించడం లేదని, పోతిరెడ్డిపాడు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ నీటిని తరలిస్తోందని ప్రస్తుతం వెలిగొండ నుంచి కూడా నీటిని తీసుకుంటోందని, ఈ అంశాలను సెప్టెంబర్ నాలుగో వారంలో జరిగే కెఆర్‌ఎంబీ పూర్తి స్థాయి సమావేశంలో సమగ్రంగా చర్చిస్తామని -తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్, రమేశ్ బాబు తెలిపారు.

66:34 నిష్పత్తిలో ఎపికి వాటాను కేటాయించాలి: ఎపి ఈఎన్సీ

మరోవైపు తాగునీటి అవసరాల నిమిత్తం 66:34 నిష్పత్తిలో ఎపి వాటాగా 97 టిఎంసీలను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఎపి ఈఎన్సీ కెఆర్‌ఎంబీ ఎదుట తన వాదనలు వినిపించారు. నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జరుపుతున్న జలవిద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరి వాదనలు వారు వినిపించడంతో నీటి పంపకాలపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదని అందుకే ఈ సమావేశం అర్ధరంతరంగా ముగిసిందని ఎపి ఈఎన్సీ నరసింహమూర్తి వెల్లడించారు.

వచ్చే ఆగస్టు వరకు తమ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం 104 టిఎంసీల నీరు అవసరమని కోరినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ 200 టిఎంసీల నీటిని కోరిందని, ఆ ప్రతిపాదన సహేతుకంగా లేదనిఆయన తెలిపారు. తెలంగాణకు అవసరం లేకున్నా శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా తీసుకుంటున్న నీరు ఎపి వాటా నుంచే తీసుకుంటున్నామని ఎవరి వాటాను అడగడం లేదని ఆయన పేర్కొన్నారు. -తాగునీటి కేటాయింపులపై ఇరు రాష్ట్రాలు రాజీలేని వైఖరిని ప్రదర్శించడంతో కృష్ణా జలాల పంచాయితీ మరోసారి అనిశ్చితికి దారితీసింది.